కిడ్నాప్ కాదు ఇష్టంగానే భర్తతో వెళ్లింది, దీపిక కేసులో వీడిన మిస్టరీ, పోలీసుల దర్యాప్తులో సినిమాను తలపించే సీన్లు

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 03:11 PM IST
కిడ్నాప్ కాదు ఇష్టంగానే భర్తతో వెళ్లింది, దీపిక కేసులో వీడిన మిస్టరీ, పోలీసుల దర్యాప్తులో సినిమాను తలపించే సీన్లు

Vikarabad Deepika Kidnap Story: దీపిక కిడ్నాప్ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడింది. దీపికను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే భర్త అఖిల్‌తో వెళ్లినట్టు పోలీసులు కన్‌ఫామ్ చేశారు. ప్రేమ పెళ్లి, ఆపై గొడవలు.. విడాకుల కోసం కోర్టుకెక్కడం.. అంతలోనే ఇద్దరూ కలిసి ముంబై వెళ్లడం.. ఇదంతా ఓ సినిమాను తలపించింది. దీపిక కుటుంబసభ్యులు కిడ్నాప్‌ అని గగ్గోలు పెట్టారు. పోలీసులు ఆఘమేఘాల మీద ఆరు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. తీరా రెండు రోజుల తర్వాత దీపికది కిడ్నాప్ కాదని.. ఇష్టపూర్వకంగానే భర్తతోనే వెళ్లిందని పోలీసులు తేల్చేశారు.

ముంబైకి వెళ్లిన జంట.. వికారాబాద్‌కు చేరుకోనుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన కిడ్నాప్‌ డ్రామా వెనుక అసలు కథేంటి.. ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారా..? లేదంటే దీపిక పేరెంట్స్‌ని డైవర్ట్ చేసేందుకే కట్టుకథ అల్లారా..? అసలేం జరిగింది?

దీపిక కిడ్నాప్‌ కేసు… సీన్‌ అంతా ఛేంజ్ అయింది. పోలీసుల దర్యాప్తులో.. సినిమాను తలపించే సీన్లు బయటపడ్డాయి. దీపిక కిడ్నాప్‌కి గురైందని భావించారంతా. కానీ సడెన్‌గా పోలీసులకు కాల్ చేసిన దీపిక తాను ముంబైలో ఉన్నట్టు సమాచారమిచ్చింది. భర్త అఖిల్‌తో సేఫ్‌గా ఉన్నట్టు తెలిపింది. దీంతో వాళ్లిద్దర్ని వికారాబాద్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

దీపిక-అఖిల్‌ ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే దీపిక తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్‌ని జీర్ణించుకోలేకపోయారు. దీపికను బలవంతంగా రెండేళ్ల క్రితం ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల బలవంతంతో అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే శనివారం(సెప్టెంబర్ 26,2020) ఇద్దరూ వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఆదివారం(సెప్టెంబర్ 27,2020) సాయంత్రం దీపిక తన సోదరితో కలిసి షాపింగ్‌ వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి దీపికను బలవంతంగా తీసుకెళ్లారని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త అఖిలే కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే అలర్టయిన పోలీసులు.. దీపిక ఆచూకీ కోసం ఆరు బృందాలుగా విడిపోయి గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. కాల్‌ డేటాపై ఫోకస్ పెట్టారు. కానీ ఎక్కడా దీపిక జాడ తెలియరాలేదు.

దీపిక ఫోన్ స్విచాఫ్ ఉండడంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే వికారాబాద్‌ పోలీసులకు దీపిక నుంచి కాల్ వచ్చింది. తాను ముంబైలో ఉన్నానని.. భర్త అఖిల్‌తో సేఫ్‌గా ఉన్నానని తెలిపింది. దీంతో పోలీసులు రిలాక్స్ అయ్యారు. కిడ్నాప్‌ కథ సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దర్నీ వికారాబాద్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. వారు వికారాబాద్‌ వచ్చాక.. అన్ని వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశముంది.

ప్రేమ పెళ్లి కోసం ఓ సినిమాలో కిడ్నాప్ డ్రామా ఆడినట్టు.. భర్తకు దగ్గరయ్యేందుకు దీపిక ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తంటే ఇష్టం.. కని పెంచిన తల్లిదండ్రులను ఎదిరించే ధైర్యం లేకపోవడం. దీంతో దీపిక కొద్దిరోజులుగా సతమతమైనట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులతో ఉంటే ఎప్పటికైనా తన భర్తకు దూరం అవుతానని అనుకుందో.. మరేదైనా తలచిందో గానీ ఎవరికీ చెప్పుకోలేక అఖిల్‌తో ముంబైకి వెళ్లినట్టు క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది.

దీపిక ఎపిసోడ్‌పై మరింత క్లారిటీ ఇచ్చారు వికారాబాద్‌ ఎస్పీ నారాయణ. భార్య, భర్త ఇద్దరూ కలిసే ముంబై వెళ్లారని స్పష్టం చేశారు. కారులో తమ్ముడితో కలిసి వెళ్లిన అఖిల్‌.. దీపికను తీసుకెళ్లాడని తెలిపారు. దీపిక ప్రేమ పెళ్లి చేసుకోవడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నారు. వాళ్లిద్దరూ ముంబై నుంచి వికారాబాద్‌ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటారని ఎస్పీ అన్నారు.