లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన : కొత్త పెళ్లి జంటపై కేసు

  • Published By: bheemraj ,Published On : June 12, 2020 / 08:06 PM IST
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన : కొత్త పెళ్లి జంటపై కేసు

కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అయితే ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని భావించి సోషల్ మీడియాలో పలు జంటలు ఒక్కటవుతున్నాయి. మరికొంతమంది లాక్ డౌన్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. 

అయితే ఇలాంటి వివాహమే చేసుకున్న ఓ జంట లాక్ డౌన్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. నిబంధనలు ఉల్లంఘించారంటూ వరుడు, వధువు, వారి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం మహారాష్ట్ర రాయ్ గడ్ జిల్లా కర్జాత్ లోని ముద్రే తహసీల్ ప్రాంతానికి చెందిన ఓ జంట గత అదివారం వివాహ బంధంతో ఒక్కటైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శుభకార్యానికి ముందస్తు రెవెన్యూ అనుమతితో 50 మంది మాత్రమే హాజరుకావాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా 150 మందిని ఆహ్వానించారు. 

దీనిపై కర్జాత్ కు చెందిన సామాజిక కార్యకర్త హృషికేషి జోషి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వరుడు, వధువు, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాయల్ గార్డెన్ హాల్ లో నాలుగు వివాహ శుభకార్యాలకు అనుమతించారని జోషి తెలిపారు.