విశాఖ గంజాయికి కేరళ స్మగ్లర్ల సాంకేతిక సాయం

  • Published By: chvmurthy ,Published On : February 5, 2020 / 05:05 AM IST
విశాఖ గంజాయికి కేరళ స్మగ్లర్ల సాంకేతిక సాయం

విశాఖ మన్యంలోని గిరిజనులకు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన గంజాయి సాగుదారులు మధ్య సంబంధాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో మారుమూల  ప్రాంతాల్లో గంజాయి పండించటానికి కేరళకు చెందిన వ్యక్తులు ఆర్ధిక, సాంకేతిక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేరళకు చెందిన గంజాయి స్మగ్లర్లు విశాఖ మన్యంలోని గిరిజనుల నుంచి భూములు లీజుకు తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు.  

మారుమూల గిరిజన ప్రాంతాల్లో వీరు గంజాయితో పాటు దానినుంచి హాషిష్ ఆయిల్ ను తీస్తున్నారు. దీనికి బహిరంగ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. గత కొన్నిసంవత్సరాలుగా విశాఖ జిల్లాలో గంజాయి స్మగ్లర్లతో సహా కేరళకు చెందిన కొందరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. దీంతో విశాఖ మన్యానికి కేరళలోని ఇడుక్కికి ఉన్న లింకు బట్ట బయలయ్యింది. కేరళ స్మగ్లర్లు విశాఖ  గిరిజనులు భూములు లీజుకు తీసుకుని గంజాయి సాగు చేస్తున్నారు. 

ఎక్సైజ్ అధికారులు అరెస్టులు చేసినప్పుడు చిన్న చిన్న ఉద్యోగస్తులు మాత్రమే  దొరుకుతున్నారు. దీని తెర వెనుక ఉన్నబడా స్మగ్లర్లు  తప్పించుకు పోతున్నారు. గంజాయి స్మగ్లర్లు హాషీష్ ఆయిల్ ను కూడా  తయారు చేసి స్మగ్లింగు చేస్తున్నారు. ఇది వారికి భారీ లాభాలను తెస్తోంది. విశాఖ మన్యంలో పండించే గంజాయికి బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, వంటి మెట్రో నగరాల్లో మంచి  డిమాండ్ ఉంది. కిలోకు రూ.30 వేల నుంచి 50 వేల దాకా ధర పలుకుతోందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 

విశాఖ మన్యంలో పండే గంజాయి నెంబరు వన్ క్వాలిటీగా పేరు పొందింది. దీని తర్వాతే కేరళలోని ఇడుక్కి జిల్లా గంజాయి ఉండటంతో కేరళ స్మగ్లర్లు విశాఖపై కన్నేశారు.  కేరళలో పోలీసు దాడులు పెరగటంతోనూ వారంతా ఏపీలోని విశాఖ మన్యంవైపు వచ్చి AOB  సరిహద్దుల్లో గంజాయి సాగుపై దృష్టి పెట్టారు. దీంతో విశాఖ గిరిజనులకు, కేరళ, తమిళనాడు స్మగ్లర్లకు గంజాయి ప్రధాన ఆదాయ వనరుగా మారింది.

విశాఖ ఏజెన్సీలో గిరిజనుల నుంచి గంజాయి సాగును వేరు చేయటం అంత తేలికైన పనికాదని సీపీఐఎం జిల్లా కార్యదర్శి బి లోకనాధం అన్నారు. అంతరాష్ట్ర స్మగ్లర్లు ఏజెన్సీలో గంజాయి సాగుకు పెట్టుబడి పెట్టటం..నిపుణులను నియమించటం తో ఇప్పుడది మంచి రాబడినిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.