ఒకరి బలవన్మరణంతో మారణాయుధాలు,కిడ్నాప్ ముఠాగుట్టు రట్టు

ఒకరి బలవన్మరణంతో మారణాయుధాలు,కిడ్నాప్ ముఠాగుట్టు రట్టు

Visakha police busted fraud gang, arrested : విశాఖ జిల్లా అనకాపల్లి గవర పాలెనికి చెందిన భీశెట్టి లోకనాధం(30) అనే వ్యక్తి గతనెల 27 తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఇల్లు శుభ్రం చేస్తుండగా రెండు పిస్టళ్లతో పాటు 18 బుల్లెట్లు దొరికాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మారణాయుధాలతో పాటు…  లోకనాధం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని కాల్ డేటాను విశ్లేషించారు.

వాటిలో ఒక నెంబరు గాజువాక న్యూపోర్టు ఏరియాకు చెందిన గంగాధర్ (రాజుభాయ్) ను గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గంగాధర్ చెప్పిన వివరాల ప్రకారం లోకనాధానికి తమ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చాయి. దీంతో తన భార్యా బిడ్డలకు దూరంగా జీవిస్తూ తన మామను అంత మొందించాలని ప్లాన్లు వేయసాగాడు. గతంలో లోకనాధం దేశంలోని పలు ప్రాంతాల్లోనూ, విదేశాల్లోనూ ఉద్యోగాలు చేయటంతో అనేక పరిచయాలు ఏర్పడ్డాయి.

ఈ నేపధ్యంలోనే ఒక క్రిమినల్ గ్యాంగుతోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ ముఠా ఆజాద్ మాంగేర్ గ్రూపు. ఈ గ్రూపు సభ్యులు స్ధానికంగా ఉన్న బడా పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు సభ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారితో లోకనాధం జత కలిశాడు. గ్రూపు సభ్యుల ఆదేశాల మేరకు….. విదేశాలకు మ్యాన్ పవర్ సప్లై చేసే విశాఖలోని ఒక ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాన్ని రూ.5లక్షలు ఇవ్వాలని  లోకనాధం డిమాండ్ చేశాడు. అలాగే పాత ఇనుపసామాన్లు కొనుగోలు చేసి అమ్మే వ్యాపారస్తుడిని రూ.6లక్షలు ఇవ్వాలని బెదిరించాడు.

ఈలోగా లోకనాధం అనారోగ్యానికి గురయ్యాడు. ఒకవైపు అనారోగ్యం…చూసే వాళ్లు, తన గురించి పట్టించుకునే వాళ్లు  ఎవరూ లేరు… భార్య బిడ్డలు దూరం కావటంతో…. తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో లోకనాధం గ్రూపులోకి రాకపోవటంతో గ్రూపు సభ్యులైన హరియాణా రాష్ట్రం మోహిత్‌ ఎరియాన్‌కు చెందిన బంటీజూట్, ఉత్తరాఖండ్‌ దినేష్‌పూర్‌కు చెందిన సామ్రాట్‌ దాలి, ఢిల్లీకి చెందిన అభిషేక్‌ భరద్వాజ్‌ లోకనాథం విషయమై అతని స్నేహితుడైన గంగాధర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.

అప్పటికే గంగాధర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ద్వారా మిగతా సభ్యులను రాష్ట్రానికి రప్పించారు. గంగాధర్ వద్దనుంచి ఒక పిస్టల్, 4 బుల్లెట్లు, 6 సెల్‌ఫోన్లు స్వాదీన పరుచుకున్నారు. గంగాధర్ ను కలవటానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠా సభ్యులు సామ్రాట్‌ దాలి, బంటీజాట్, అభిషేక్‌ భరద్వాజ్‌ లను అనకాపల్లి పోలీసులు అరెస్టు చేసారు. వీరిని మంగళవారం స్థానిక కోర్టులో హాజరు పరిచగా న్యాయమూర్తి వీరికి రిమాండ్‌ విధించారు.