మత్తులో మునిగిపోతున్నారు : మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా విశాఖ

స్మార్ట్‌ సిటీ విశాఖ మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. ఊహించని రీతిలో నగర శివార్లలోనే కాదు.. నడిఒడ్డున కూడా మత్తులో ముంచెత్తడానికి ఎన్నో అడ్డాలు

  • Edited By: veegamteam , April 20, 2019 / 02:09 PM IST
మత్తులో మునిగిపోతున్నారు : మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా విశాఖ

స్మార్ట్‌ సిటీ విశాఖ మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. ఊహించని రీతిలో నగర శివార్లలోనే కాదు.. నడిఒడ్డున కూడా మత్తులో ముంచెత్తడానికి ఎన్నో అడ్డాలు

స్మార్ట్‌ సిటీ విశాఖ మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. ఊహించని రీతిలో నగర శివార్లలోనే కాదు.. నడిఒడ్డున కూడా మత్తులో ముంచెత్తడానికి ఎన్నో అడ్డాలు అందుబాటులోకి వచ్చాయి. డ్రగ్స్‌ గంజాయి గుట్టుచప్పుడు కాకుండా నగరంలో విక్రయిస్తున్నారు. విశాఖలోని కొన్ని ఇంజినీరింగ్‌ కాలేజీలు, విద్యా సంస్థలను టార్కెట్ చేసుకుని  .. మాదకద్రవ్యాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. విశాఖలో రేవ్‌ పార్టీ వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు… మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు.  

వీడ్‌ అంటే గంజాయి సిగరెట్‌.. డోప్‌ అంటే మద్యం చాక్లెట్‌ అని.. మీకు తెలుసా? మీకే కాదు.. నగరంలో చాలామందికి తెలియదు. మాదకద్రవ్యాలకు బానిసలైన మత్తులో మునిగి తేలే వారికి మాత్రం..  ఈ కోడ్‌ బాగా తెలుసు. వీటి కోసం కాఫీడే సెంటర్లు, బార్లు, పార్కులను అడ్డాగా చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ను సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో అందుబాటులో ఉంచుతున్నారు. మత్తుకు అలవాటు పడినవారు బానిసలుగా మారి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెగబడుతున్నారు. ఇందులో అత్యధికులు విద్యావంతులే కాక.. బడాబాబుల పిల్లలు ఉంటున్నారు. ఇంకా ఒకడుగు ముందుకేసి విశాఖలో రేవ్‌ పార్టీలకు కూడా కారణమవుతున్నారు. ఇటీవల రుషికొండ బీచ్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో.. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి అదుపు తప్పిన యువత తీరు చూసి .. ప్రశాంత విశాఖ నివ్వెరపోయింది.

డ్రగ్స్‌కు అలవాటుపడిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. ఏటా వీరి సంఖ్య పెరుగుతోందని .. ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. కొంతమంది ధనికులు, స్థితిమంతుల పిల్లలు వీటికి అలవాటు పడ్డాక .. మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారి ద్వారా .. డ్రగ్స్‌ను కాలేజీలు, పార్కులు, హోటళ్ల వద్దకు రప్పించుకుంటున్నారు. తొలుత మత్తునిచ్చే గంజాయి సేవనం.. ఆ తర్వాత కొన్నాళ్లకు నిషేధిత మాదకద్రవ్యాల వైపు మళ్లుతున్నారు. దీనికి ఉదహరణే 2018 ఏయూలో జరిగిన సంఘటన. ఫుల్లుగా గంజాయి సేవించిన విద్యార్ధులు.. లేడీస్ హాస్టల్ ముందు వీరంగం చేయడంతో ఆ విద్యార్ధులను సప్సెండ్ చేశారు. అలాగే ఏయూ ఇంజనీరింగ్‌ హాస్టల్స్‌ను తనిఖీలు చేశారు. తనిఖీల్లో విద్యార్ధులు రూమ్‌లు చూసి .. మంత్రి గంటా షాక్ అయ్యారు. కొన్ని రుమ్స్‌లో గంజాయి, మద్యం వైట్నర్స్ ఇలా  ఎన్నో ఉన్నాయి. అప్పట్లో గంజాయికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీ చేసినా.. పూర్తిస్ధాయిలో అమలు కాలేదనే ఆరోపణలున్నాయి.

ఎవరికీ అనుమానం రాకుండా సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. మామూలు సిగరెట్లలో పొగాకును తొలగించి పొడిలా చేసిన గంజాయిని పెడతారు. వీటినే కాఫీడేలు, బార్లు, పార్కులు, హోటళ్లు వద్ద ఎక్కువగా విక్రయిస్తుంటారు. హైదరాబాద్, పాడేరు, అరకులోయ కేంద్రంగా గంజాయి చాక్లెట్లు తయారవుతున్నాయి. గంజాయి నూనె, పొడి మిశ్రమంతో సిసలైన చాక్లెట్ల మాదిరిగా వీటిని తయారు చేస్తుంటారు. వీటిని కూడా కాఫీడేలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఖరీదైన హోటళ్ల దగ్గర రహస్యంగా విక్రయిస్తున్నారు. ఒక్కో సిగరెట్‌ ధర రూ.100 నుంచి 250 వరకు, చాక్లెట్‌ సైజును బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఒక్క గంజాయి సిగరెట్‌ తాగితే గంటకుపైగా మత్తుగా ఉంటుంది. గంజాయి చాక్లెట్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందంటారు. ఒక చాక్లెట్‌ను తింటే ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తులో ముంచెత్తుతుంది. అందుకే వీటికి అలవాటైన శ్రీమంతుల పిల్లలు .. ఎంత ఖరీదైనా వెనకడగు వేయరు. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసలయ్యాక వాటి నుంచి బయట పడలేకపోతున్నారు. మానసిక ఒత్తిడి అధికమై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చేతిలో డబ్బుల్లేకపోతే చోరీల బాట పడుతున్నారు. చోరీలు, గొలుసు దొంగతనాల్లో పట్టుబడుతున్న వారిలో పలువురు యువకులతో పాటు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల రుషికొండలో నిర్వహించిన రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలను సేవించినట్టు తేలింది. అంతేకాదు వారి వద్ద ఎండీఎం, ఎల్‌ఎస్‌డీ వంటి నిషేధిత మాదకద్రవ్యాలు లభించాయి. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసినట్టు నిందితులు వెల్లడించారు. ఏకంగా దీనికోసం ఒక వెబ్‌సైట్‌నే నడుపుతున్నారంటేనే..  పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో కొన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, కాఫీడే సెంటర్లు, సిరిపురం జంక్షన్, హెచ్‌ఎస్‌బీసీ-వుడా పార్క్‌ మధ్య ప్రాంతం, ఏయూ ఇంటర్నేషనల్‌ హాస్టల్‌ పరిసరాలు, పాత పోస్టాఫీసు, రైల్వేస్టేషన్, ఎంవీపీ కాలనీ, సాగరతీరంలోని గోకుల్‌ పార్క్, లాసన్స్‌ బే బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ తదితర ప్రాంతాలు మాదక ద్రవ్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా ఉన్నాయి.