Dowry Harassment : పెళ్లైన 10 ఏళ్లకు కూడా వరకట్న వేధింపులు ..వివాహిత ఆత్మహత్య
పెళ్లై 10 ఏళ్లైనా భర్త అదనపు కట్నం కోసం వేధించటంతో ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది.

Married Woman Suicide
Dowry Harassment : పెళ్లై 10 ఏళ్లైనా భర్త అదనపు కట్నం కోసం వేధించటంతో ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. విశాఖజిల్లా అనకాపల్లి గాంధీననగరం ఇన్ కంటాక్స్ వీధికి చెందిన మొల్లి నవ్యగీత(29) కు గొలుగొండ మండలం కృష్ణదేవి పేటకు చెందిన ప్ర్రైవేట్ స్కూల్ టీచర్ దేవర నాగేశ్వరరావుతో 2011 లో వివాహాం అయ్యింది. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
పెళ్ళై దశాబ్దం గడిచినా భర్త నాగేశ్వరరావు నిత్యం భార్యను పుట్టింటి నుంచి డబ్బులు తీసుకు రమ్మని వేధించేవాడు. దీంతో నవ్యగీత మానసికంగా బాధపడేది. ఈనెల ఒకటోతేదీన కూడా నాగేశ్వరరావు మళ్లీభార్యను డబ్బుల విషయమై మానసికంగా బాధ పెట్టాడు.
దీంతో మనస్తాపం చెందిన నవ్యగీత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. మృతురాలి తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అనకాపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.