చదివింది 10వ తరగతే, అందమైన అమ్మాయిల ఫొటోలతో రూ.60లక్షలు దండుకున్నాడు

  • Published By: naveen ,Published On : August 17, 2020 / 04:07 PM IST
చదివింది 10వ తరగతే, అందమైన అమ్మాయిల ఫొటోలతో రూ.60లక్షలు దండుకున్నాడు

ఎదుటి వారి వీక్ నెస్సే వారి పెట్టుబడి. వారి బలహీనతను సొమ్ము చేసుకుంటారు. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించారు. అందమైన అమ్మాయిల ఫొటలతో ఏకంగా రూ.60లక్షలు దండుకున్నారంటే ఆ కేటుగాళ్లు ఎంతటి మోసగాళ్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయనగరం టూ టౌన్ పోలీసులు ఓ గ్యాంగ్ ను పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ చెప్పిన వివరాలు తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు.



ఇంటర్నెట్ లో అందమైన అమ్మాయిల ఫొటోలు ఎరగా పెడతారు. వేరే అమ్మాయిలతో మాట్లాడిస్తారు. ఆ తర్వాత అందినకాడికి దోచుకుంటారు. ఇలా సుమారు 3 వేల మంది నుంచి రూ.60లక్షలు పైగా లాగేసిన ఇద్దరు హైటెక్‌ మోసగాళ్లను విజయనగరం టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



చదివింది పదో తరగతే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాస్:
విజయనగరం పట్టణానికి చెందిన టి.అశ్వనీరాజు పదో తరగతి వరకు చదువుకున్నాడు. గతంలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. ఇంటర్నెట్ పై పట్టు సంపాదించాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించే సమయంలో పట్టణానికి చెందిన సింధు భైరవి అనే వివాహితను తన కింద ఉద్యోగిగా చేర్చుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. పైగా చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో ఈజీగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.



అందమైన ఫొటోలతో ఎర వేస్తాడు:
అందులో భాగంగా 2017 నుంచి ఇంటర్నెట్ లో అశ్లీల కార్యకలాపాలకు తెరలేపాడు. అందులో భాగంగా అందమైన అమ్మాయిల ఫొటోలు, వీడియోలు ప్రజలను ఆకర్షించేందుకు ఓ వెబ్‌సైట్‌లో పెట్టేవాడు. ఇందుకుగాను ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సిందు భైరవిని తన భాగస్వామిగా చేర్చుకున్నాడు. ఆమెతో ఫోన్లు మాట్లాడించడం చేయించేవాడు. మరికొంత మంది అమ్మాయిలను సంప్రదించి వారి ఫొటోలను కూడా పంపించేవాడు. కావాల్సిన చోటికి రావాలంటే ముందుగా రూ.5వేల నుంచి రూ.8వేలు తన ఖాతాకు డబ్బులు పంపిస్తే వాళ్లు వస్తారని చెప్పేవాడు. డబ్బులు పంపిన వెంటనే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేవాడు. తర్వాత మరో కొత్త నెంబర్ తో కార్యకలాపాలు చేసేవాడు.



ఎన్నారై ఫిర్యాదుతో వెలుగులోకి మోసం:
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ ఎన్నారై ఇదే తరహాలో మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు. 2020 మార్చి 20న తనకు రూ.8,500 పంపించమంటే అనుకోకుడండా ఆన్‌లైన్‌లో రూ.85వేలు పంపించాడు. ఆ తర్వాత ఫోన్లు పని చేయకపోవడం, వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో మోసపోయినట్లు గమనించి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఆగస్టు 11న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆదివారం(ఆగస్టు 16,2020) మధ్యాహ్నం రింగురోడ్డు సమీపంలో తిరుగుతున్న అశ్వనీరాజు, సింధుభైరవిని అదుపులోకి తీసుకున్నారు.