బావిలో 9 మృతదేహాల కేసు, పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో 9మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం

  • Published By: naveen ,Published On : May 23, 2020 / 07:16 AM IST
బావిలో 9 మృతదేహాల కేసు, పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో 9మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో 9మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం సంచలనం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. వలస కార్మికుల మరణాలు మిస్టరీగా మారాయి. ఇవి హత్యలా? సామూహిక ఆత్మహత్యలా? అనేది అంతు చిక్కడం లేదు. గురువారం(మే 21,2020) 4 మృతదేహాలు వెలుగుచూడగా, శుక్రవారం(మే 22,2020) మరో 5 బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమ బెంగాల్‌ వాసులు కాగా, ఇద్దరు బీహార్‌, ఒకరు త్రిపురవాసిగా పోలీసులు గుర్తించారు. 

బతికి ఉండగానే బావిలో పడ్డారు:
కాగా, పోలీసులతో పాటు అందరూ పోస్టుమార్టం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. వాళ్లంతా బతికి ఉండగానే బావిలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అంటే వారిని చంపి బావిలో ప‌డేయ‌లేద‌ని తేలింది. వారు నీట మునిగే మ‌ర‌ణించార‌ని, అయితే బావిలో ప‌డే స‌మ‌యంలో తాకిన చిన్న చిన్న గాయాలు మృత‌దేహాల‌పై ఉన్నాయ‌ని వ‌రంగ‌ల్ ఎంజీఎం వైద్యులు ప్రాథ‌మిక పోస్టుమార్టం నివేదిక ఇచ్చారు. మరి వాళ్లంతట వాళ్లే నీళ్లలోకి దూకారా? లేదంటే విషం, మత్తులాంటిది ఇచ్చి బతికి ఉండగానే బావిలోకి తోసేశారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా పోస్టుమార్టం నివేదిక మ‌ర‌ణాల చిక్కుముడిని మ‌రింత బిగించింది. 

మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు మాయం:
ఈ కేసులో ఫోన్ కాల్స్ కీలకం కానున్నాయి. మక్సూద్ కూతురు బుస్రాతో సన్నిహితంగా మెలుగుతున్న యాకూబ్ ఫోన్ కాల్స్‌తోపాటు.. ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడారనేది కీలకం కానుంది. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు లభ్యం కాకపోవడంతో.. వారి ఫోన్ల కోసం పోలీసుల గాలిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే యాకూబ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడితోపాటు బీహర్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

అసలేం జరిగింది..?
మక్సూద్ కుటుంబంతో పాటు మ‌రో ముగ్గురు ఇత‌ర యువ‌కుల మృత‌దేహాలు కూడా ఉండ‌టం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకే కుటుంబం మూకుమ్మ‌డి ఆత్మ‌హ‌త్య చేసుకుందని అనుకున్నా, మరి ఇత‌ర యువ‌కులు వీరితో ఎందుకు కలుస్తారు…? అన్న ప్ర‌శ్న‌ ఎదురవుతోంది. అయితే… మ‌క్సూద్ ఫోన్ ముందు రోజు రాత్రి 9గంట‌ల త‌ర్వాత స్విచ్ఛాఫ్ అయిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇత‌రుల‌వి మాత్రం సాయంత్రం 6గంట‌ల‌కే స్విచాఫ్ చేసిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. దీంతో పోస్టుమార్టం నివేదిక‌లో ఏవైనా క్లూస్ దొరుకుతాయ‌ని భావించిన పోలీసులకు నిరాశే మిగిలింది.

మరణాల వెనుక భూ మాఫియా హస్తం?
మొత్తంగా తొమ్మిది మంది మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసులో కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానిక భూ మాఫియానే తొమ్మిది మంది ప్రాణాలు తీసిందా? తమ అడ్డాలో భయోత్పాతం సృష్టించి పారిపోవాలనే పథకాన్ని భూ యజమానులు పన్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అలాగే వలస కార్మికులకు అన్నదానం పేరుతో పంపిణీ చేసిన ఫుడ్ లో విషం కలిపారా? అందరినీ అంతమొందించి స్థానికంగా భయోత్పాతం సృష్టించాలనుకున్నారా ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గొర్రెకుంటలో భూ వివాదాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

20ఏళ్ల క్రితం బెంగాల్ నుంచి వరంగల్ వచ్చిన మక్సూద్ కుటుంబం:
పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబర్ నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గోదాం పక్కనే ఉన్నపై భవనంలో బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు కూడా నివసిస్తూ గోదాంలో పనిచేస్తున్నారు. 

9మంది మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఆరుగురు:
పరిశ్రమ యజమాని సంతోష్‌ రోజూలాగే గోదాం దగ్గరికి వచ్చే సరికి కార్మికులెవరూ కనిపించలేదు. పరిసరాల్లో అన్వేషించినా జాడ లేకపోవడంతో.. పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూశాడు. నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలాడుతూ కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గురువారం(మే 21,2020) బావి నుంచి మృతదేహాలు తీశారు. ముందుగా ఒకే కుటుంబానికి చెందిన మక్సూద్ ఆలం (50), ఆయన భార్య నిషా ఆలం (45), కూతరు బూస్రా ఆలం (22), ఈమె మూడు సంవత్సరాల బాలుడు మృతదేహాలు బావి నుంచి వెలికి తీశారు. శుక్రవారం(మే 22,2020) బావిలో నీటిని తోడుతుండగా మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం (21), చిన్న కుమారుడు సోహైల్ ఆలం (20) వీరితో పాటు గోనె సంచుల గోదాం దగ్గరికి వాహనాలను నడిపే త్రిపురకు చెందిన డ్రైవర్ షకీల్ (40)తో పాటు బీహార్‌కు చెందిన శ్రీరామ్ (35), శ్యామ్ (40)ల మృతదేహాలు వెలికి తీశారు.

Read: బావిలో 9 మృతదేహాల కేసు, పోలీసుల అనుమానం దానిపైనే