ఈ నగరానికేమైంది : శివారు హత్యలతో నగర ప్రజలు బెంబేలు

  • Published By: chvmurthy ,Published On : November 30, 2019 / 04:09 AM IST
ఈ నగరానికేమైంది : శివారు హత్యలతో నగర ప్రజలు బెంబేలు

హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్నసంఘటనలు చూస్తుంటే  ఇక్కడ మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కారు పడి ఓ మహిళ మృతి.. బంజారాహిల్స్‌లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ మహిళా ఉద్యోగి దుర్మరణం.. శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌ సమీపంలో పశు వైద్యురాలు దారుణ హత్య..  ఆఘటన మరువక ముందే మరో మహిళ  మంటల్లో కాలిపోవటం ఇలా వరుస ఘటనలు చూస్తుంటే నగర  ప్రజలు వణికిపోతున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన నిర్మానుష్య ప్రదేశాల్లో అకతాయిల  వేధింపులు…మహిళలు కనపడకుండా పోయే ఆదృశ్యం కేసులు… పోలీసు స్టేషన్ దాకా రాని కేసులు ఇలాంటివి  చూస్తుంటే మహిళలకు ఇక్కడ భద్రత ఎంతవరకు ఉందనేకి అనుమానంగానే ఉంది. కొన్ని సంఘటనలు జరిగిన తీరు చూస్తుంటే విన్న వారంతా అయ్యో పాపం, ఎంత ఘోరం అంటూ కన్నీరు కార్చారు. ఆయా సంఘటనల్లో దుర్మరణం పాలైన వారి కుటుంబ సభ్యుల రోదనలు ఆయా ఘటనలతో సంబంధం లేని వారినీ కంటతడి పెట్టించాయి. పోలీసులు, షీ టీమ్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళలు బలై పోవటం కన్నీరు పెట్టిస్తోంది.  పోలీసులకు చిక్కకుండా నేరగాళ్లు పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్ననేరాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. 

మహిళల్ని ఎక్కడో చంపేయడం…నగర శివార్లలోకి తీసుకొచ్చి శవాల్ని దహనం చేయడం.. మృతదేహాల్ని పడేయడానికి సీసీ కెమెరాలు లేని నిర్మానుష్య ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం..  పక్కా ప్లాన్ ప్రకారమే నేరగాళ్లు ఈ ఘాతకాలు చేస్తున్నారనటానికి నిదర్శనాలు. 2019 లో  గడిచిన 9 నెలల కాలంలో  శుక్రవారం నవంబర్29న జరిగిన ఘటనతో కలిపి 5 దారుణహత్యలు జరిగాయి.  నవంబర్27, బుధవారం రాత్రి షాద్‌నగర్‌ శివార్లలో దారుణహత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ఘటన ఈ కోవలోనిదే. శుక్రవారం నవంబర్ 29 జరగిన ఘటనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మిగిలిన మూడు హత్య కేసుల్లో హంతకుల ఆచూకీ అటుంచి.. అసలు హతులెవరనేదే ఇప్పటివరకు తేలలేదు.

పెరుగుతున్న శివారు హత్యలు
శంషాబాద్‌ మండలం తొండుపల్లి శివారులో 2019, మార్చి 19న కాలిపోయిన గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.  ముప్పై ఏళ్లలోపు వయసున్న ఓ యువతిని దుండగులు ఎక్కడో చంపి అక్కడకు తీసుకువచ్చి పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతకు నాలుగు రోజుల క్రితమే హత్య చేసి ఉంటారనేది పోస్టుమార్టంలో తేలింది. మృతదేహంపై తమిళ అక్షరాలతో కూడిన లాకెట్‌, పంజాబీ డ్రెస్‌, గాజుల్ని పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి ఓ కారు వచ్చి వెళ్లినట్లు దూరంగా ఉన్న సీసీ కెమెరాల్లో గుర్తించారు కానీ.. రాత్రివేళ కావడం వల్ల కెమెరా రికార్డు చేసిన దృశ్యాల్లో స్పష్టత లేకపోవడంతో నేరస్తులు ఇంతవరకు దొరకలేదు. 

ఏప్రిల్ 19 ,2019 లో నార్సింగి శివారులో    కాలిపోయిన మరో మహిళ  మృతదేహం లభించింది. ముందు రోజు రాత్రి లేదా ఆ రోజు తెల్లవారుఝూమున తీసుకు వచ్చిపడేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.  అంతకు 2,3 రోజులముందే ఆమెను చంపి అక్కడకు తీసుకువచ్చి పడేశారని నిర్ధారించారు.  ఆమెను గుర్తుపట్టానికి వీలులేకుండా  ముఖంపై పెట్రోల్ పోసి తగల బెట్టారు. చేతి వేలికి ఉంగరం,కాలికి నల్లదారం మాత్రం ఆమెను గుర్తించటానికి ఆనవాళ్లుగా ఉన్నాయి. ఈ కేసులోనూ నిందితులు ఇంతవరకు దొరకలేదు. 

2019, ఏప్రిల్ 16న  చేవెళ్ల  మండలం ముడిమ్యాల లో  ముఖం పూర్తిగా కాలిపోయిన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 30 ఏళ్ళలోపు వయస్సున్న మహిళను పెట్రోల్ తో కాల్చి చంపేసారు. ఈ ఘటనలో కాళ్లు మినహా మిగతా శరీర భాగాలు పూర్తిగా కాలిపోవటంతో ఆమెను గుర్తించటం కూడా కష్టమయ్యింది. 

2019 నవంబర్ 29.. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిద్దులగుట్ట రోడ్డులోని బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఘటన జరిగింది.  20ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. అత్యంత దారుణంగా యువతిని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు దుండగులు. పూర్తిగా డెడ్ బాడీ కాలిపోయింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకను చంపి 24గంటలు గడవక ముందే అదే ప్రాంతంలో మహిళ హత్య కావడంతో ఈ హత్య సంచలనంగా మారింది. నిత్యం పూజలు జరిగే స్థలంలోనే ఈ ఘటన జరిగింది.  వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు.