ఎవరు చంపారు : రాధిక హత్య మిస్టరీ

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 06:48 PM IST
ఎవరు చంపారు : రాధిక హత్య మిస్టరీ

కరీంనగర్ జిల్లాలో దారుణంగా హత్యకు గురయిన రాధిక హత్య మిస్టరీ వీడడం లేదు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. హంతకులను గుర్తించలేకపోతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పక్కా ప్లాన్‌తో హత్య చేసిన హంతకులు ఆధారాలు చెరిపేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో రాధిక శరీర అవయవాలను ఫోరెన్సిక్‌కు పంపించారు.

రాధిక అవయవాలను హైదరాబాద్, వరంగల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. ఫోరెన్సిక్ పరీక్షల తరువాత ఏ సమయంలో, ఏ విధంగా రాధిక మరణించిందనే పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి ఒక వారం నుంచి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

రాధిక మర్డర్‌ మిస్టరీని చేధించేందుకు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు పోలీసులు. ఇప్పటి వరకు ఎవరు హత్య చేశారనే గాని, ఎందుకు హత్య చేశారనే విషయంలో గాని ఒక అంచనాకు రాలేకపోతున్నారు. సాక్ష్యాధారాలు చెరిపేయడాన్ని చూస్తే.. ఇంటి గురించి బాగా తెలిసిన వారే ఇలాంటి పని చేసుంటారని అనుమానిస్తున్నారు. దీంతో పలువురిని అదుపులోకి తీసుకొని విచారించినప్పటికీ.. వారే నిందితులని తేల్చేందుకు తగిన ఆధారాలు లేకపోవడంతో విచారించి వదిలేశారు.

రాధిక హత్య మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండరని తెలిసిన వారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముందుగా రాధికను హత్య చేసి తరువాత గొంతు కోసినట్లు పోస్ట్‌మార్టం ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

హత్య జరిగిన తరువాత హంతకులు అక్కడే చాలా సమయం ఉండి.. ఇంట్లో ఎలాంటి ఆనవాళ్లు, ఆధారాలు లేకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ఈ మిస్టరీని చేధించేందుకు పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నా.. చివరకు ఆ దారులన్నీ మూసుకుపోతున్నాయి.

ఘటన స్థలం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు రక్తనమూనాలు, వేలిముద్రలు సేకరించారు. 8 ప్రత్యేక బృందాలు సాంకేతికపరమైన అంశాలతో పాటు సీసీ కెమెరాల పుటేజిని సేకరించారు. అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. విద్యానగర్ కాలనీ పరిధిలోని 36 సీసీ కెమెరాల పుటేజిలను పరిశీలించినా కనీసం అనుమానితులను కూడా గుర్తించలేకపోయారు.

సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముందుకెళ్లినప్పటికీ.. అక్కడ కూడా సరైన ఆధారాలు దొరకలేదు. ఇప్పటి వరకు 70 శాతం కేసు పరిశోధన పూర్తయిందని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా సరైన ఆధారాలు దొరక్కపోవడంతో హంతకులు ఎవరనేది తేలడం లేదు.