ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? జైలుకెళ్తావా? అత్యాచార నిందితుడికి సుప్రీం ప్రశ్న!

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? జైలుకెళ్తావా? అత్యాచార నిందితుడికి సుప్రీం ప్రశ్న!

Will You Marry Her Supreme Court Asked Government Employee  : అత్యాచారం కేసులో ప్రభుత్వ ఉద్యోగిని సుప్రీంకోర్టు సూటిగా ఓ ప్రశ్నించింది. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? లేదా జైలుకెళ్తావా అని సుప్రీం ప్రశ్నించింది. అత్యాచారం కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిందితుడు సుప్రీంను ఆశ్రయించాడు. మ‌హారాష్ట్ర విద్యుత్తు శాఖ‌కు చెందిన ఉద్యోగి మోహిత్ సుభాష్ చ‌వాన్ తనపై నమోదైన అత్యాచారం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. టెక్నిషియన్ అయిన మోహిత్ నిందితుడు ఓ స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.

దాంతో నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బెయిల్ పిటిషన్‌ వేయగా.. కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసును విచారించిన సీజే ఎస్ఏ బోబ్డే.. నిందితుడికి ఒక అవకాశం కల్పించారు.. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అని సూటిగా అడిగారు.. అవసరమైతే ఈ విషయంలో నీకు సాయం చేస్తామని అన్నారు. లేదంటే మాత్రం.. నువ్వు నీ ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని, జైలు శిక్ష కూడా పడుతుందని పేర్కొంది.

బాలికను మోసం చేసి.. అత్యాచారం చేసిన నీకు.. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగి అన్న ఆలోచ‌న లేదా అని సీజే నిందితుడిని నిలదీసింది. బాధితురాలిని నువ్వు పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి చేయ‌డంలేదని తెలిపింది. ఈ విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో కోర్టుకు చెప్పాల్సిందిగా సూచించింది. పోలీసులను బాధితురాలు ఆశ్రయించినప్పుడు అతడి తల్లి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. కానీ, బాధిత బాలిక పెళ్లిని నిరాకరించింది.

బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేలా ఒక అగ్రిమెంట్ ప్రతిపాదన ముందుంచింది. అయితే నిందితుడు మాత్రం తాను పెళ్లి చేసుకోలేనని అన్నాడు. తనకు ఇదివరకే పెళ్లి అయిందని, మరో పెళ్లి చేసుకోలేనని అన్నాడు. తాను ఒకవేళ అరెస్ట్ అయితే ఆటోమాటిక్ గా తాను ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతానని కోర్టుకు తెలిపాడు. నాలుగు వారాల వ‌ర‌కు అరెస్టును నిలిపివేస్తున్నామని సీజే త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆలోగా రెగ్యులర్ బెయిల్ కోసం అప్లయ్ చేసుకోవచ్చునని సూచించింది.