Tamilnadu : ప్రేమించటం లేదని మహిళను కిడ్నాప్ చేసిన ప్రేమికుడు

తనను ప్రేమించటం లేదనే కోపంతో ఒక వ్యక్తి 15మందితో వచ్చి మహిళను కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

Tamilnadu : ప్రేమించటం లేదని మహిళను కిడ్నాప్ చేసిన ప్రేమికుడు

Tamilnadu : తనను ప్రేమించటం లేదనే కోపంతో ఒక వ్యక్తి 15మందితో వచ్చి మహిళను కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.  తంజావూరు జిల్లా ఆడుతురైకి చెందిన విఘ్నేశ్వరన్(32) అనే వ్యక్తి మైలాదుతురైలో కొన్నేళ్ళుగా నివసిస్తున్నాడు.  అతని ఇంటి సమీపంలోని వారి దూరపు బంధువులు తమ కుమార్తె(23)తో కలిసి నివసిస్తున్నారు.

విఘ్నేశ్వరన్ ఆ మహిళపై మనసు పారేసుకున్నాడు. ఆమెను ప్రేమించమని వేధించసాగాడు. అతనికి ఉన్న చెడు అలవాట్లు దృష్టిలో పెట్టుకుని ఆ మహిళ అతడి ప్రేమను తిరస్కరించింది. అయినా ఆమెను వదిలి పెట్టకుండా వెంటపడి వేధించసాగాడు. దీంతో ఆమె తల్లితండ్రులు  మైలాదుతురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విఘ్నేశ్వరన్ ను పోలీసు స్టేషన్ కు పిలిచి అతడిని హెచ్చరించి… ఇక పై ఆమెను డిస్టర్బ్ చేయనని లేఖ రాయించుకుని పంపించారు పోలీసులు.

అనంతరం జులై 12న విఘ్నేశ్వరన్ ఆ మహిళను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా మహిళ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న విఘ్నేశ్వరన్ గత సోమవారం ఆగస్టు 1వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సుమారు 15 మందిని వెంటబెట్టుకు వచ్చి ఇంటి తలుపులు పగల గొట్టి మహిళను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు.

అలర్టైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిన పోలీసులు హైవే పై కారులో వెళుతున్న విఘ్నేశ్వరన్ అండ్ గ్యాంగ్ ను అడ్డుకున్నారు. విక్రంవాడి టోల్ ప్లాజా వద్ద మహిళతో సహా  మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కు సహకరించిన మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.