Woman Ends Life : భర్త వేధించి..కొడుతున్నాడని వివాహిత బలవన్మరణం

ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కాపురానికి వచ్చినప్పటినుంచి అనుమానంతో భార్యను మాటలతో వేధించి.. చిత్ర హింసలు పెడుతుంటే తట్టుకోలేని ఇల్లాలు తనువు చాలించిన ఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు రాసిన సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది.

Woman Ends Life : భర్త వేధించి..కొడుతున్నాడని వివాహిత బలవన్మరణం

Woman Ends Life

Woman Ends Life :  ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కాపురానికి వచ్చినప్పటినుంచి అనుమానంతో భార్యను మాటలతో వేధించి.. చిత్ర హింసలు పెడుతుంటే తట్టుకోలేని ఇల్లాలు తనువు చాలించిన ఘటన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు రాసిన సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది.

హైదరాబాద్ యూసఫ్ గూడ లోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లో విజయ (31) భర్త ఆంజనేయులుతో కలిసి ఉంటోంది. వీరికి ఇద్దరు కొడుకులు. 14 సంవత్సరాల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాటి నుంచి భర్త చిత్రహింసలు పెట్టేవాడు. అనుమానంతో భార్యను అనరాని మాటలు అనేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన విజయ… ఏప్రిల్ 27 మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణానికి అల్లుడు ఆంజనేయులు కారణమని మృతురాలి తల్లి మణెమ్మ ఫిర్యాదు చేసింది.

పెళ్లి జరిగిన తెల్లవారి నుంచే అల్లుడు తమ కూతురిని అనుమానిస్తూ హింసించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు తన కూతురు ఫోన్‌ చేసి పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పిందని, మరో రెండు గంటలకే అల్లుడు కొడుతున్నాడని చెప్పి ఏడ్చిందని మణెణ్మ వాపోయింది. ఆ సమయంలో తన అల్లుడు ఫోన్‌ లాక్కొని మీ కూతురిని చంపేస్తానని చెప్పాడని, తెల్లవారి చూసేసరికి కూతురు శవమై కనిపించిందని మణెమ్మ తన ఫిర్యాదులో తెలిపింది.

కాగా మృతురాలు రాసిన సూసైడ్ నోట్ పలువురి కంట తడిపెట్టిస్తోంది. ”విజయ అనే నేను.. నా భర్త పెట్టే బాధలు భరించలేక చనిపోతున్నాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రోజూ చావకొడుతూనే ఉన్నాడు. మళ్లీ నన్ను డ్యూటీకి పొమ్మంటాడు. డ్యూటీకి పోతే అక్రమ సంబంధాలు అంటగడుతూ.. ఒంటి మీద బట్టలు లేకుండా కొట్టేవాడు. నన్ను చంపడానికి చూశాడు. నేను చనిపోయినా నా భర్తను మాత్రం వదలకండి చంపేయండి.

మా ఆయన తన అన్న చంద్రయ్య అండతో నన్ను వేధించేవాడు. దాన్ని చంపేస్తే మీ అక్కబిడ్డనిచ్చి పెళ్ళి చేస్తాననేవాడు. నా చావుకు ముఖ్య కారణం ఈ అన్నదమ్ములు. నా పిల్లలు మా అమ్మానాన్న, అన్న, తమ్ముడితో ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ… విజయ రాసిన సూసైడ్‌ నోట్‌ పలువురి కంట తడి పెట్టించింది. మణెమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.