అచ్చం దృశ్యం సినిమాలోలాగే సుఖాంతయ్యేది..? కానీ.. మూడేళ్ల తర్వాత వీడిన మిస్సింగ్ మిస్టరీ

‘దృశ్యం’ సినిమా గుర్తుంది కదూ. ఓ నీచుడిని చంపేసి అతడి శవాన్ని హీరో పూడ్చి పెడతాడు. అతడు ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలీదు. మర్డర్ చేసినా శవాన్ని పూడ్చినా.. ఒక్క ఆధారం కూడా దొరక్కుండా చేస్తాడు హీరో. చివరికి.. హీరో స్వయంగా నోరు విప్పి చెప్పే వరకు అసలు విషయం ఎవరికీ తెలీదు. దాదాపుగా అలాంటి దృశ్యమే రియల్ లైఫ్ లోనూ జరిగింది. కానీ, సినిమాలో మాదిరిగా కథ సుఖాంతం అవ్వలేదు.

అచ్చం దృశ్యం సినిమాలోలాగే సుఖాంతయ్యేది..? కానీ.. మూడేళ్ల తర్వాత వీడిన మిస్సింగ్ మిస్టరీ

Mystery

yellandu police chase murder myster after three years: ‘దృశ్యం’ సినిమా గుర్తుంది కదూ. ఓ నీచుడిని చంపేసి అతడి శవాన్ని హీరో పూడ్చి పెడతాడు. అతడు ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలీదు. మర్డర్ చేసినా శవాన్ని పూడ్చినా.. ఒక్క ఆధారం కూడా దొరక్కుండా చేస్తాడు హీరో. చివరికి.. హీరో స్వయంగా నోరు విప్పి చెప్పే వరకు అసలు విషయం ఎవరికీ తెలీదు. దాదాపుగా అలాంటి దృశ్యమే రియల్ లైఫ్ లోనూ జరిగింది. కానీ, సినిమాలో మాదిరిగా కథ సుఖాంతం అవ్వలేదు. మూడేళ్ల తర్వాత మర్డర్ మిస్టరీ వీడింది. ఈ అదృశ్యం కేసులో మూడేళ్ల తర్వాత పోలీసులకు ఊహించని ఆధారం చిక్కింది. దాంతో లోతుగా కూపీ లాగారు. 2018లో యువకుడి అదృశ్యం కేసు హత్యగా తేల్చారు.

ఓ హత్యాయత్నం కేసు విచారణలో బయటపడిన నిజం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఓ హత్యాయత్నం కేసుని విచారిస్తుంటే, మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న మరో హత్యోదంతం బయటపడింది. సినీ ఫక్కీని తలపించే ఈ ఉదంతంలో తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఇల్లెందు మండలం ఇందిరానగర్‌ ఎంపీటీసీ సభ్యుడు మండలి రాముపై మార్చి 3న రాజకీయ కక్షతో హత్యాయత్నం జరిగింది. ఇటీవల అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఓ నిందితుడు 2018లో అదృశ్యమైన ఇల్లెందు కాకతీయనగర్‌కు చెందిన దైదా విజయ్‌కుమార్‌ (24) అలియాస్‌ శివ కేసు గురించి షాకింగ్ నిజం చెప్పాడు. దాని ఆధారంగా కూపీ లాగితే అతనిది అదృశ్యం కాదని, ప్రత్యర్థులు హతమార్చారని తేలింది.

2018లో అసలేం జరిగిదంటే..
ఇల్లందు పట్టణానికి చెందిన శివ పెద్దగా చదువుకోలేదు. పనీ పాట లేకుండా చిల్లర గ్యాంగ్‌లతో తిరిగేవాడు. ఎవరితో పడితే వాళ్లతో గొడవ పడుతూ.. కొట్లాటకు దిగేవాడు. పోలీసులు చెప్పినా అతడి తీరు మారలేదు. దీంతో అతనిపై రౌడీషీట్ కూడా నమోదు చేశారు. వర్గ తగాదాల్లో తలదూర్చి పలు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఈ గొడవలు ముఠా తగాదాలకు దారితీశాయి. అందరినీ హడలెత్తించిన శివ.. 2018లో సడెన్ గా అదృశ్యం అయ్యాడు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు అతడి గురించి ఆరా తీసినా జాడ దొరకలేదు. దీంతో శివ కుటుంబసభ్యులు ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ, ఎలాంటి లాభం లేకపోయింది. అతడు ఏమయ్యాడు? అనే మిస్టరీని చేధించలేకపోయారు. కుటుంబసభ్యులు కొందరిపై ఆరోపణలు చేసినా, వాటి నిరూపణకు పోలీసుల దగ్గర సరైన ఆధారాలు లభించ లేదు. దీంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారు.

ఓ కేసులో క్రిమినల్ ఇచ్చిన సమాచారంతో:
కాగా, ఎంపీటీసీపై హత్యాయత్నం కేసు విచారణలో పోలీసులకు క్లూ దొరికింది. ఎంపీటీసీ హత్యాయత్నం కేసులో ఓ నేరస్తుడి ద్వారా ‘విజయ్‌కుమార్‌’ ది హత్యేనని తెలిసింది. ఆ క్రిమినల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కమ్ము, కమల్‌, పాసిలను అదుపులోకి తీసుకుని విచారించారు. శివని హత్య చేసినట్లు వారు అంగీకరించారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని కూడా చూపించారు. రెండ్రోజుల క్రితం అక్కడ తవ్వి తీశారు. నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఆ శవం విజయ్‌కుమార్‌దేనని కుటుంబీకులు గుర్తించారు. ముగ్గురు ప్రధాన నిందితులను కోర్టు రిమాండ్‌కు పంపామని, హత్యతో సంబంధం ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బ్యాట్ కొట్టి చంపి.. స్మశానంలో పూడ్చేశారు:
శివతో గొడవల నేపథ్యంలో ఇల్లందు ప్రాంతానికి చెందిన ప్రత్యర్థులు వలిపిరెడ్డి రాజ్‌కమల్‌ అలియాస్‌ కమ్ము (ఆటోడ్రైవర్‌), తంబల్ల కమల్‌ (లారీ డ్రైవర్‌), బాబు రాజ్‌ పాసి (కూలి) మరో ముగ్గురితో కలిసి విజయ్‌కుమార్‌ హత్యకు స్కెచ్ వేశారు. 2018, సెప్టెంబర్ 9న సాయంత్రం ఇల్లెందు గవర్నెంట్ జూనియర్ కాలేజీ దగ్గర శివ ఒంటరిగా దొరికాడు. ఇదే మంచి చాన్స్ అని క్రికెట్‌ బ్యాట్లతో మూకుమ్ముడిగా దాడి చేశారు. దీంతో శివ మృతిచెందాడు. అప్పటికే చీకటి పడుతోంది. ఎవరి కంటా పడకుండా శవాన్ని దగ్గర్లోని శ్మశానవాటికలో పూడ్చేశారు. నాడు జరిగిన ఘోరం నేడు బయటపడింది.