నెల రోజుల్లో పెళ్లి…….హత్యకు గురైన పెళ్లి కొడుకు

  • Published By: murthy ,Published On : December 8, 2020 / 05:36 PM IST
నెల రోజుల్లో పెళ్లి…….హత్యకు గురైన పెళ్లి కొడుకు

Young Man allegedly murdered in Nellore : నెల్లూరుకు చెందిన యువకుడికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. మరో నెలరోజుల్లో పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ ఆధివారం అర్ధరాత్రి ఆయువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
ravindranath reddy

నెల్లూరు నగర పాలకసంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే మల్లిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విక్రమ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. మొదటి భార్య సీతారావమ్మ మరణించటంతో శంకరమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. వారిలో రవీంద్రనాథ్‌ రెడ్డి (25) చెన్నైలో బీటెక్‌ పూర్తి చేసి సంగంలోని ఫెడరల్‌ బ్యాంకులో రుణాలు ఇప్పించే ఏజెంటుగా రెండేళ్లుగా పని చేస్తున్నాడు. ఇటీవలే అతడికి హరనాథపురానికి చెందిన ఓ యువతితో నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరి 8వ తేదీన వివాహం జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈలోగా ఇంట్లోని వారు పెళ్లి పనులు చేస్తున్నారు.



డిసెంబర్ 4వ తేదీన రవీంద్రనాధ్ రెడ్డి ఆఫీసు మీటింగ్ ఉందని చెప్పి విజయవాడ వెళ్ళాడు. డిసెంబర్ 6వతేదీ ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి గం.11-30 ప్రాంతంలో ఫోన్ చేసి నెల్లూరుకు దగ్గరో ఉన్నానని కాసేపట్లో బస్సుదిగి ఇంటికి చేరుకుంటానని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడి కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో గం 12-15 సమయంలో రవీంద్రనాద్ రెడ్డి మళ్లీ ఫోన్ చేశాడు. “‘‘నాన్నా.. నేను కరెంటాఫీస్‌ సెంటర్‌ వద్ద కార్‌జోన్‌ దగ్గర ఉన్నాను. ఎవరో వచ్చి నన్ను కత్తులతో పొడిచారు. మాట్లాడలేక పోతున్నా’’ అంటూ చెప్పాడు.



ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఘటనా స్ధలం వద్దకు బయలుదేరారు. ఈలోగా శ్రీనివాసులు రెడ్డి ఈవిషయాన్ని తన మేనల్లుడు శ్యామ్ కు చెప్పి ఘటనా స్ధలానికి రమ్మని కోరాడు. అనంతరం భార్యతో కలిసి శ్రీనివాసులురెడ్డి అక్కడకు వెళ్లే సరికి వేదాయపాళెం ఎస్సై టీవి సుబ్బారావు, మరోక ఎస్సై లక్ష్మణరావు అక్కడ ఉన్నారు. తీవ్రగాయాలతో ఉన్న రవీంద్రనాధ్ రెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వేదాయపాళెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేదానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబ సబ్యులకు అప్పగించారు.

కారణం ఏమై ఉంటుంది ?
నెలరోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సినవాడు పాడె ఎక్కటం కుటుంబ సభ్యులను కలిచి వేసింది. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. హత్యకు గల కారణాలపై పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది సేపట్లో ఇంటికి వస్తానని చెప్పిన కొడుకు 45 నిమిషాల వ్యవధిలో శవమై తేలాడు. అసలు రవీంద్రనాధ్ రెడ్డి కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద ఎందుకు బస్సు దిగాల్సి వచ్చింది. అతడ్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఫోన్ కాల్ వివరాలు, సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా కేసు విచారణ ముమ్మరం చేశారు. కాగా కరెంటాఫీసు సెంటర్లో సీసీ కెమెరాలు పరిశీలించి చూడగా రవీంద్రనాధ్ రెడ్డి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలను కనిపించాయి. ఏది ఏమైనా రవీంద్రనాధ్ రెడ్డి హత్య మిస్టరీగానే మారింది. అతడికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా…. ఇతరత్రా వ్యవహారాల వల్ల అతనికి శత్రువులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.