మద్యం మత్తులో మహిళా పంచాయతీ కార్యదర్శిపై యువకులు దాడి

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 10:40 AM IST
మద్యం మత్తులో మహిళా పంచాయతీ కార్యదర్శిపై యువకులు దాడి

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం బాదలాపురంలో పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డారు. పించన్ల కోసం దరఖాస్తు చేసుకన్నా ఎందుకు ఇవ్వడం లేదని గొడవ చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు కులం పేరుతో మహిళా కార్యదర్శి శైలజను దూషించారు. అడ్డొచ్చిన కార్యదర్శి భర్తపై కూడా దాడి చేశారు. ఈ ఘటన మొత్తం గ్రామ పంచాయతీ కార్యలయంలో జరిగింది. గ్రామస్తులు అడ్డుకోవడంతో యువకులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శికి పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

పంచాయతీ కార్యదర్శి శైలజ గ్రామ కార్యాలయంలో ఉన్నప్పుడు మద్యం మత్తులో ఉన్న ఏడుగురు యువకులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు పెన్షన్ కోసం ధరఖాస్తు చేసుకుని అన్ని అయినప్పటికీ ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదని వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ చేయడం వరకే తన బాధ్యత అని మిగిలిన ప్రక్రియ పైనుంచి జరగాలని ఆమె పదే పదే చెప్పినా వారు సంతృప్తి పడకుండా తీవ్రమైన వాగ్వాదానికి దిగారు.

కులం పేరుతో దూషిస్తూ ఓ మహిళను అనరాని మాటలు అంటూ, బూతులు మాట్లాడుతూ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం వెంటనే తన భర్తకు తెలపడంతో అతను అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో ఆయనపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు బైక్ పై వెళ్లే క్రమంలో వారిపై దాడికి యత్నించినట్లు సమాచారం.దీంతో బాధిత కార్యదర్శి మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కార్యదర్శి ఆరోపిస్తున్నారు.