Diamond Rings Missing At Nalgonda District Jail 

ప్రణయ్ కేసు : జైల్లో శ్రవణ్ వజ్రపు ఉంగరాలు మాయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నల్గొండ :  జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితుల ఉంగరాలు జైలులో మాయం కావడం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్య తర్వాత అమృత తండ్రి మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో శ్రవణ్ తన మూడు వజ్రపు ఉంగరాలను జైలు సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత మారుతీరావు, శ్రవణ్‌ను అక్కడి నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే.. ఇటీవల బెయిల్ లభించడంతో.. నిందితులిద్దరూ జైలు నుంచి బయటకు వచ్చారు. నిందితులను  జైలు మార్చేటప్పుడు వారి వస్తువులను వారికి తిరిగి ఇవ్వాలి. కానీ వారిని వరంగల్ సెంట్రల్  జైలుకు మార్చినప్పుడు వీరి వస్తువులు తిరిగి ఇవ్వలేదనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

నిందితులను వరంగల్ జైలుకు మార్చినప్పుడు.. శ్రవణ్ భార్య నల్గొండ జిల్లా జైలుకు వెళ్ళి తన భర్త ఉంగరాలు ఇవ్వవలసిందని కోరగా.. జైలు అధికారులు నిరాకరించారు. ఎవరైతే నిందితులు వస్తువులు ఇచ్చారో.. వారు వస్తేనే ఇస్తామని చెప్పి ఆమెను తిప్పి పంపించినట్లు తెలుస్తోంది.  

బెయిల్పై బయటకు వచ్చిన శ్రవణ్ ఇటీవల నల్గొండ జిల్లా జైలుకు వెళ్లి.. తన ఉంగరాలను ఇవ్వాలంటూ సిబ్బందిని కోరాడు. అవి కనిపించడం లేదని సిబ్బంది నుంచి సమాధానం వచ్చింది. దీంతో శ్రవణ్ డీజీపీకి ఫిర్యాదు చేస్తానని అధికారులకు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై జైలు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో.. అంతర్గత విచారణ జరుగుతోంది. జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య ఉంగరాల మాయంపై విచారణ జరుపుతున్నారు. ముగ్గురు అనుమానితులను విచారించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా జైళ్శశాఖ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఈ విషయమై జైళ్ల శాఖ డిఐజి సైదయ్య మాట్లాడుతూ ఒక ఖైదీకి సంబందించిన విలువైన ఉంగరాలు కనిపించడం లేదు. విచారణ జరుపుతున్నాం. ఖచ్చితంగా రికవరీ చేస్తాం. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశాం. భవిష్యత్ లో ఇలా జరగకుండా లాకర్ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తాం అని హామీ ఇచ్చారు డీఐజీ సైదయ్య.

Related Posts