నెరవేరనున్న కల, సినీ నటుడు అలీకి సీఎం జగన్ గుడ్ న్యూస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సినీ నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. రాజకీయాలకు కూడా కాస్త దగ్గరగానే ఉంటారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు అలీ. ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగింది కూడా. కానీ, అది వర్కవుట్‌ కాలేదు.

అలీని సినీ ఇండస్ట్రీ దూరం పెట్టిందా?
మరోపక్క, వైసీపీలో అలీ చేరిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయంటున్నారు. సినిమా ఇండస్ట్రీ కాస్త దూరం పెట్టిందట. అప్పటి వరకూ సినిమా అవకాశాలు పుష్కలంగా ఉన్న అలీకి ఇప్పుడు పూర్తిగా అవకాశాలు రావడం లేదని చెబుతున్నారు. దీనికి కారణం వైసీపీలో చేరడమే అంటున్నారు అలీ సన్నిహితులు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఆయనకు ఇంతవరకు ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఎలాంటి పదవీ రాలేదు. అటు సినిమాలు లేక.. ఇటు పదవీ రాక తనలో తానే ఆందోళన చెందుతున్నారట అలీ.

అలీకి ఒక పదవి ఖాయం?
ఇక చేసేదేం లేక ఎన్నికల తర్వాత దాదాపు ఏడాదిన్నరకు సీఎం జగన్‌ని కలిశారు అలీ. తనకున్న ఇబ్బందులు, ఇండస్ట్రీ విషయాలు సీఎంతో చర్చించారట. తనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి కారణాలు కూడా సీఎంకు వివరించారని చెబుతున్నారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా ఏదైనా పదవి ఇస్తామని అప్పట్లో అలీకి జగన్‌ హామీ ఇచ్చారట. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ని కలవడంతో అలీకి త్వరలో ఏదో ఒక పదవి గ్యారెంటీ అనే టాక్‌ మొదలైంది.

అలీకి జగన్ చాన్స్ ఇస్తారా?
సినిమా రంగం నుంచి పోసాని, అలీ లాంటి వాళ్లు వైసీపికి మద్దతు ఇచ్చినా ఇంత వరకూ ఎవరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు సీఎం జగన్. పృధ్వీకి ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి ఇచ్చినా.. కొన్ని ఆరోపణల కారణంగా ఆ పదవిని వదులుకోవలసి వచ్చింది. ఆయన మినహా ఇతరులెవరికీ పదవులు దక్కలేదు. మరిప్పుడు అలీకి అవకాశం ఇస్తారో లేదో చూడాలంటున్నారు.

Related Posts