డీఎంకే ఎంపీ భారతి అరెస్ట్, విడుదల

DMK MP RS Bharathi Arrested for Derogatory Remarks Against Judges from Dalit Community

డీఎంకే పార్టీకి చెందిన రాజ్య‌స‌భ  సభ్యుడు ఆర్ఎస్ భార‌తిని  చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నంగనల్లూరులోని ఆయన నివాసం లో శనివారం తెల్లవారు ఝూమున ఆయన్ను  ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ చ‌ట్టం కింద అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. అణ‌గారిన వ‌ర్గాల‌పై ఎంపీ భార‌తి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వ్యాఖ్యలు చేసిన  3 నెలల తర్వాత పోలీసులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. కాగా అరెస్ట్ చేసిన కొన్నిగంటల్లోనే మధ్యంతర బెయిల్ లభించి భారతి విడుదలయ్యారు. 

ఆది త‌మిజార్ పెరావాయి ద‌ళిత నేత అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు  పోలీసులు ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. 2020, ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన క‌ళైనార్ రీడింగ్ స‌ర్కిల్ వ‌ద్ద నిర్వ‌హించిన  ఒక స‌మావేశంలో ఎంపీ భార‌తి దళిత జడ్జిల మీద అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. డీఎంకే పార్టీ కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శిగా కూడా భార‌తి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.  

భారతి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆవిషయమై ఆయన వివరణకూడా ఇచ్చి క్షమాపణ కూడా చెప్పారు.  అణగారిన వర్గాల వారికోసం కరుణానిధి చేసిన మంచి పనిని హైలైట్ చేయడమే తన ఉద్దేశ్యం అని ఆయన పేర్కోన్నారు. 

పోలీసులు అరెస్టు చేసిన  అనంతరం ఆయ‌న మాట్లాడుతూ  సోషల్ మీడియా లో ఒక గ్రూప్ తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేసిందని...ఆ వ్యాఖ్యలకు తాను ఇది వరకే క్షమాపణ చెప్పానని..తనను రాజకీయంగా అణగ దొక్కటానికే వేధిస్తున్నారని ఆరోపించారు. అదీకాక డిప్యూటీ సీఎం ప‌న్నీరుసెల్వంపై  శుక్రవారం అవినీతి ఆరోప‌ణ‌లు చేసినందుకే తనను అరెస్టు చేసిన‌ట్లు  కూడా ఎంపీ భార‌తి తెలిపారు.  

కోవిడ్‌19 వైద్య ప‌రిక‌రాల స‌ర‌ఫ‌రాలో తీవ్ర అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు భార‌తి ఇటీవల ఆరోపించారు. మరోవైపు కోయంబత్తూరులో క్రిమి సంహారక మందుల వాడకానికి సుమారు 200 కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న మంత్రి ఎస్పీ వేలుమణిపై ఫిర్యాదు చేయనున్నట్లు భారతి తెలిపారు. 

Read: కరోనా వైరస్ సోకి 18 మంది పోలీసులు మృతి

మరిన్ని తాజా వార్తలు