బీజేపీని నిలదీసిన రాజస్థాన్ సీఎం : బీజేపీలో టీడీపీ ఎంపీల విలీనం కరెక్టా…కాంగ్రెస్ లో బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనం తప్పా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజస్థాన్ లో తమ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బీఎస్పీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాజస్థాన్ స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది.

అయితే, బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్దమంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై సీఎం అశోక్ గెహ్లాట్ ఘాటుగానే స్పందించారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడం తప్పయితే.. టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం కావడం ఒప్పతుందా? అని ప్రశ్నించారు.

బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌లో విలీనం కావడాన్ని తప్పుపడుతున్నారని… తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రాత్రికి రాత్రి బీజేపీలో విలీనమయ్యారని… ఈ విలీనాన్ని మాత్రం సరైందని బీజేపీ వాదిస్తుందని దుయ్యబట్టారు. మరి టీడీపీ ఎంపీలు విలీనమైనప్పుడు బీజేపీ వాదన ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌లో విలీనాన్ని మాత్రం తప్పంటున్నారని మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడి వల్లే బీఎస్పీ ఎమ్మెల్యేలకు మాయావతి విప్ జారీచేశారని ఆరోపించారు. బీజేపీకి బయపడే ఆమె అటువంటి ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మరోవైపు,ఆగస్ట్ 14న అసెంబ్లీని సమావేశపరచడానికి రాజస్థాన్ గవర్నర్ అనుమతించడంతో ఆరోజున అశోక్ గెహ్లాట్ ‌నాయకత్వంలోని కాంగ్రెస్ భవితవ్యం తేలిపోనుంది. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? మరో మధ్యప్రదేశ్ పునరావృతం? అనేది తేలడానికి మరో రెండు వారాలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను మరో చోటుకు తరలించింది. శిబిరాన్ని జైపూర్ నుంచి జైసల్మేర్‌కు మార్చింది.

Related Posts