లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

అయోధ్య రామునికి మైహోమ్ రూ.5 కోట్ల విరాళం

Published

on

Dr. Jupally Rameshwar Rao Donates Rs. 5 Cr For Ram Mandir : భారతజాతి యావత్తు అత్యంత భక్తి శ్రద్దలతో సంకల్పించిన అయోధ్య రామాలయ నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన మై హోమ్ గ్రూప్ తన వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ మహాక్రతువులో భాగస్వామి అయ్యింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సమక్షంలో ఈరోజు శంషాబాద్ జీయర్ ఆశ్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషికి రామాలయ నిర్మాణ నిమిత్తం మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు రూ.5కోట్ల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు.

ఇదే కార్యక్రమంలో పలు ఇతర పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొని తమ వంతు సహాయం అందజేశారు. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డి రూ. 6కోట్ల రూపాయలు, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రెడ్డి రూ. 2 కోట్ల రూపాయలు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఛైర్మన్ సతీశ్ రెడ్డి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. కావేరీ సీడ్స్ అధినేత భాస్కర్ రావు, చల్మెడ విద్యాసంస్థ అధినేత లక్ష్మీనరసింహారావు, ఎఎంఆర్ సంస్థ అధినేత మహేశ్ రెడ్డి కూడా తమ వంతు సహాయం అందజేశారు. మై హోమ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సరయూ నది తీరం మొత్తం రామనామ స్మరణతో మారుమోగుతోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం దేశంలోని హిందువులందరి కోరిక. 495 ఏళ్ల ఆవేదన… 70 ఏళ్ల నిరంతర కృషి ఫలితంగా రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. గత ఏడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ శిలాన్యాస్ చేశారు. భూమిపూజా కార్యక్రమంతో రామాలయ నిర్మాణ ఘట్టానికి అంకురార్పణ జరిగింది. ఈ మహాక్రతువు నిరాటంకంగా సాగేందుకు భారీగా నిధుల అవసరం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడుపుతున్న హిందూ సేవా సంస్థలు.. రామాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని భావించాయి. అందుకే ధనవంతుడు, నిరుపేద అనే తేడాలేకుండా రూపాయి మొదలు ఎంతైనా ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని కోరుతున్నాయి.

హిందూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు మైహోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వరరావు గత నలబై ఏళ్లుగా తన వంతు కృషి చేస్తున్నారు. పలు హిందూ దేవాలయాలకు తన వంతు సహాయసహకారాలు అందజేయడమే కాకుండా.. మై హోమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్మితమయ్యే ప్రతి హౌజింగ్ ప్రాజెక్టులోనూ స్వయంగా హిందూ దేవాలయ నిర్మాణాన్ని చేపడుతూ వస్తున్నారు.

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో సమతా ప్రాజెక్టు ద్వారా 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య విగ్రహ ప్రతిష్టాపన, 108 వైష్ణవ నమూనా దేవాలయాల నిర్మాణానికి జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక బృహత్ కార్యానికి డాక్టర్ రామేశ్వరరావు శతదా సహాయసహకారాలు అందిస్తున్నారు. హిందూ సంస్కృతి పరిరక్షణతోపాటు, సమాజంలో ధార్మిక జీవన అలవాట్లను పెంపొందించటంలో దేవాలయాలకున్న విశిష్ట ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆలయాల నిర్మాణ నిర్వహణలో డాక్టర్ రామేశ్వరరావు అత్యంత శ్రద్ధా భక్తులను కనబరుస్తున్నారు.