దుబ్బాక ఉపపోరు.. గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

dubbaka bypoll.. దుబ్బాక ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం కానుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు పడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ తరఫున రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్‌ కేటాయించడం దాదాపు ఖరారైనట్టే. బీజేపీ నుంచి రఘునందన్ రావు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఈసారి విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.

టీఆర్ఎస్‌లో అసమ్మతి స్వరం:
టీఆర్ఎస్‌లో అసమ్మతి స్వరం కూడా వినిపిస్తోందని అంటున్నారు. రామలింగారెడ్డి కుటుంబం నుంచి కాకుండా మరెవరికైనా ఇస్తే బావుంటుందని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. మాజీ మంత్రి, దివంగత నేత చెరకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు.

ముత్యంరెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లోకి వచ్చినప్పుడు ఆయనకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించాలని కేసీఆర్ భావించారు. ఈలోపే ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సందర్భంగా ఆయన కుమారుడు శ్రీనివాసరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామన్న హామీ ఇప్పుడు తెరపైకి వచ్చిందట.

ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్న శ్రీనివాసరెడ్డి:
ఒకవేళ రామలింగారెడ్డి కుటుంబం నుంచే సీటు ఖరారైతే, శ్రీనివాసరెడ్డికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోందట. తనకు సీటు ఖరారు కాకపోతే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్లేది లేదు కానీ, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని శ్రీనివాసరెడ్డి తన ప్రధాన అనుచరులతో స్పష్టం చేశారని చెబుతున్నారు.

ఇక రఘునందన్ రావు దాదాపుగా పార్టీ అధిష్టానం తన అభ్యర్ధిత్వాన్నే ఖరారు చేస్తుందన్న ధీమాతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీలో కూడా అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఇప్పటికే రఘునందన్ రావుకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి మరొకరికి ఇస్తే బాగుంటుందన్నది మరో వర్గం వాదన.

విజయశాంతిని ఎలాగైనా రంగంలోకి దించి గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావన:
మరోవైపు కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని ఎలాగైనా రంగంలోకి దించి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోందట. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపొందాలని ఆ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవేళ విజయశాంతి పోటీకి ఒప్పుకుంటే ఆమెకు ఈ ప్రాంతం సుపరిచితమే. గతంలో మెదక్ ఎంపీగా ఆమె సేవలందించారు. కానీ, ఆమె మాత్రం అంత ఆసక్తి చూపించడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ శ్రావణ్ కుమార్‌ రెడ్డి కూడా ఈ సీటును ఆశిస్తున్నారట.

టీఆర్ఎస్‌కు మద్దతిచ్చేందుకు సీపీఐ సిద్ధం:
టీఆర్ఎస్‌లో అసమ్మతి గళం వినిపిస్తున్నా కేసీఆర్‌ అభ్యర్థిని ప్రకటించాక అవేమీ ఉండవని, పార్టీ గెలుపు కోసం కింది స్థాయి నుంచి అంతా కలసి పని చేస్తారని పార్టీ సీనియర్లు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో అన్ని మండలాలకు ఇన్‌చార్జిలుగా ఎమ్మెల్యేలను నియమించింది. వారు వివిధ గ్రామాల్లో ప్రజలతో కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సీపీఐ సిద్ధంగా ఉందంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఈ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలవడంతో ఈ వాదనకు బలాన్నిస్తోంది.

READ  తెలంగాణకు చేరిన కరోనా ఔషధం

అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నది అధికార పార్టీ వ్యూహం:
ఇక్కడ నుంచి రెండుసార్లు ఓటమి చెందిన రఘునందన్‌రావుకు సెంటిమెంట్ ఓటు ఉన్నా దానికి చెక్ పెట్టేందుకు మంత్రి హరీశ్‌రావు పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయశాంతిని బరిలోకి దించితే ఎదురయ్యే పరిణామాలను హరీశ్‌ అంచనాలు వేస్తున్నారట. గెలుపు ధీమాతో ఉండొద్దంటూ పార్టీ కేడర్‌ను అలర్ట్ చేస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దించినా భారీ మెజారిటీతో తమ అభ్యర్ధిని గెలిపించి, ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమతో సీపీఐ కలసి వస్తే మరింత మెజారిటీ పెరుగుతుందని భావిస్తోందట.Related Posts