10th, ఇంటర్ బోర్డులు రద్దు!

  • Published By: madhu ,Published On : April 25, 2019 / 03:16 AM IST
10th, ఇంటర్ బోర్డులు రద్దు!

10th, ఇంటర్ బోర్డులు రద్దు చేస్తారా అనే ప్రచారం జోరందుకుంది. ఈ పరీక్షలతో పాటు ఉన్నత విద్యా మండలి నిర్వహించే ఇంజినీరింగ్, లాసెట్, పీజీ సెట్ వంటి ప్రవేశ పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చేు విద్యా సంవత్సరం నుండి పరీక్షల నిర్వాహణకు ప్రత్యేక కమీషరేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని స్టడీ చేసి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

కొన్ని రోజులుగా ఇంటర్ పరీక్షల గందరగోళంపై కేసీఆర్..2019, ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టెన్త్ పరీక్షల్లో గందరగోళ పరిస్థితులు లేకపోయినా..ప్రశ్నా పత్రాల లీక్..జవాబు పత్రాలు కనిపించకుండా పోవడం..ఘటనలు చోటు చేసుకున్నాయి. టెన్త్‌, ఇంటర్‌ బోర్డులను రద్దుచేసి ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఒకే దగ్గరికి తీసుకరావాలని..ఇందుకు అవసరమైన విధానాన్ని సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

రెండు, మూడు నెలల్లోనే పరీక్షల కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తారని టాక్. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదాలో ఓ సీనియర్ IAS అధికారిని కమిషనరేట్‌కు అధిపతిగా ఉండనున్నారు. టెన్త్, ఇంటర్ బోర్డుల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని కమిషనరేట్‌కు ట్రాన్స్ ఫర్ చేసి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్రభుత్వ పరీక్షల కమిషనరేట్ విధి విధానాలను సిద్ధం చేసే బాధ్యతలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు, మాజీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అప్పగించినట్లు తెలుస్తోంది.

సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా గతంలో రాజీవ్‌ శర్మ పని చేయడంతో పాటు ఇంజనీరింగ్‌, మెడికల్‌, అగ్రికల్చర్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఆయన కన్వీనర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా ప్రవేశాలను చేపట్టడంలోనూ రాజీవ్‌ శర్మ కీలకపాత్ర పోషించారు.