ఇంజనీరింగ్ : 25 శాతం సీట్లు భర్తీకాని కోర్సులు రద్దు  

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 06:34 AM IST
ఇంజనీరింగ్ : 25 శాతం సీట్లు భర్తీకాని కోర్సులు రద్దు  

హైదరాబాద్ : ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలకు ఈ ఏడాది మరిన్ని కష్టాలు తప్పేలాలేవు. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలపై మరో పిడుగు పడింది. ఇప్పటికే సగానికి పైగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు మూసివేతకు గురయ్యాయి. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన కాలేజీల అఫిలియేషన్ నిబంధనలు రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల యాజమాన్యాలకు మరోసారి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 2019-20 విద్యా సంవత్సరానికి జేఎన్ టీ యూ రూపొందించిన నిబంధనల ప్రకారం వరుసుగా మూడేళ్లు కనీసం 25 శాతం సీట్లు భర్తీ కాని కోర్సులకు అనుబంధ గుర్తింపు రద్దు చేస్తారు.

గతేదాడి నిర్వహించిన కౌన్సిలింగ్ లో ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు బీ ఫార్మసీ ఎంపీసీస్ట్రీమ్), పార్మా ఢీ కోర్సులు అందించే 307 కాలేజీలు పాల్గొన్నాయి. వీటిలో 45 కాలేజీల్లోనే 100 శాతం అడ్మిషన్లు జరిగాయి. ఏకంగా 55 కాలేజీల్లో 100 లోపు అడ్మిషన్లు, 29 కాలేజీల్లో 50 లోపు అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఈ కాలేజీల్లోని ఏ కోర్సులోనూ 25 శాతం అడ్మిషన్లు జరిగే అవకాశం లేదు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగిన కాలేజీల్లోని కోర్సులపై వేటు ఖాయమనిపిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో మరోసారి కాలేజీలు, కోర్సులు భారీ స్థాయిలో మూతపడే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి 25 శాతం నిబంధనను గతేడాదే అమలు చేయాలని జేఎన్ టీయూ నిర్ణయించింది. కానీ యాజమాన్యాల ఒత్తిడితో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఈ సారి మాత్రం అనుబంధ గుర్తింపును నిబంధనల్లో చేర్చడం విశేషం.

ఇంజనీరింగ్ తోపాటు పీజీ కోర్సులు అందించే కాలేజీలలో ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరును కచ్చితంగా అమలు  చేయాలనే నిబంధనను జేఎన్ టీయూ ప్రవేశపెట్టింది. బయోమెట్రిక్ హాజరు లేకపోతే కాలేజీకి అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇంజనీరింగ్ కాలేజీల్లోని బయోమెట్రిక్ అమలుపై జేఎన్ టీయూ రెండేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఈ నిబంధనను అతిక్రమిస్తున్న పలు కాలేజీలు ఫ్యాకల్టీ వేలిముద్రలను క్లోనింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. కాగా కాలేజీ, కోర్సు అనుమతి సమయంలో ఏఐసీటీఈకి, జేఎన్ టీయూకు వేర్వేరు వివరాలు అందించేవి, ఫ్యాకల్టీ సంఖ్యను ఏఐసీటీఈకి సాంక్షన్ సీట్ల ప్రకారం అందించి.. జేఎన్ టీయూకి మాత్రం అడ్మిషన్ల ప్రకారం చూపించేది. జేఎన్ టీయూ తాజా ఆదేశంతో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు ఫ్యాకల్టీలను భారీ సంఖ్యలో నియమించుకోవాల్సి ఉంటుంది. కాలేజీలు తప్పించుకునే అవకాశం లేకుండా విద్యా సంవత్సరం ఎప్పుడైనా ఆకస్మిత తనిఖీలు చేపడతామని జేఎన్ టీయూ తెలిపింది.