క్యాప్ జెమినీలో ఈ ఏడాది 30వేల ఉద్యోగాలు భర్తీ

  • Published By: chvmurthy ,Published On : March 1, 2020 / 03:13 PM IST
క్యాప్ జెమినీలో ఈ ఏడాది 30వేల ఉద్యోగాలు భర్తీ

ప్రాన్స్ కు చెందిన టెక్‌ దిగ్గజం క్యాప్‌జెమిని భారతదేశంలోని టెకీలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారత్‌లో కొత్తగా 30,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది. ఈ సంస్థకు ఇప్పటికే భారత్‌లో దాదాపు 1.15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా చేపట్టబోయే నియామకాలతో తమ కంపెనీ విలువ భారత్‌లో మరింతగా పెరుగుతోందని క్యాప్‌జెమిని భావిస్తోంది. అనుభవజ్ఞులతో పాటు ప్రెషర్స్‌కు కూడా ఈ నియామకాల్లో అవకాశం కల్పించిననున్నట్టు క్యాప్‌జెమిని ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అశ్విన్‌ యార్డి పీటీఐకు తెలిపారు. 

తమ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నవారిలో భారత్‌లోనే సగం మంది ఉన్నారని చెప్పారు. తమ వ్యాపారంలో భారత్‌ది కీలకమైన భాగమని యార్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 25,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో నూతన సాంకేతికతపై నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా మారిందని అన్నారు. 

తమ కంపనీ ఉద్యోగుల్లో 65 శాతం కంటే ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారేనని చెప్పారు. 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న మధ్య స్థాయి ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీరిని ప్రాజెక్ట్ నిర్వాహకులుగా గానీ ఆర్కిటెక్ట్ లుగా నియమించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. క్యాప్ జెమినీకి ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆఫీసులో కావల్సినంత స్థలం ఉంది. దీనితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కంపెనీకి ఉన్న సెంటర్లను పెంచుతుండటంతో  కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నట్లు  అశ్విన్ తెలిపారు.