ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం : ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 06:18 AM IST
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం : ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా ఉచితంగానే రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ చేస్తామని గురువారం (ఏప్రిల్ 25,2019) ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే.. ఇప్పటికే రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌కు డబ్బు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది 9లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. 3.25లక్షల మంది ఫెయిల్ అయ్యారు.
Also Read : ఇంటర్ మంటలు : కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు

ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను పునః పరిశీలిస్తామని బోర్డు తెలిపింది. రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌నెట్‌ కేంద్రాల దగ్గర క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. మే 15 లోపు కొత్త ఫలితాలు, కొత్త మెమోలు ఇంటికి వస్తాయని చెప్పింది. ముందు జాగ్రత్త కోసం ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.

ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఇంటర్‌ ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలపై బుధవారం (ఏప్రిల్ 24,2019) సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్‌.. పరీక్షలో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

* రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం 8 ప్రత్యేక కౌంటర్లు
* ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లోనూ అప్లయ్ చేసుకోవచ్చు
* మే 15 లోపు ఇంటర్ విద్యార్థులకు కొత్త మెమోలు
Also Read : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడరు