చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : బీజేపీ డిమాండ్

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 04:24 PM IST
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : బీజేపీ డిమాండ్

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై బీజేపీ నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం అని లక్ష్మణ్ అన్నారు. ఇంటర్ బోర్డు తప్పిదాలకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని వాపోయారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడి ఆత్మహత్యపై ఆయన విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆశిస్తున్న మార్కులకు వచ్చిన మార్కులక పొంతనే లేదన్నారు. పిల్లల ఆత్మహత్యలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ తప్పుపట్టారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు తప్పిదాలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. బోర్డు తప్పిదాల దృష్ట్యా విద్యార్థులకు ఉచితంగా జవాబు పత్రాలు ఇవ్వాలన్నారు.

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం విద్యార్థుల ప్రాణాలు తీస్తోంది. వాల్యుయేషన్, పరీక్షా ఫలితాలు, మెమోలలో తప్పిదాలు జరిగాయి. పాస్ అవ్వాల్సిన వాళ్లు ఫెయిల్ అయ్యారు. 100 మార్కులు వస్తాయని అనుకున్న వారికి తక్కువ మార్కులు వచ్చాయి. జిల్లా టాపర్లు కూడా ఫెయిల్ అయినట్టు రిజల్స్ట్ వచ్చాయి. దీంతో విద్యార్థులు షాక్ తిన్నారు. ఇంటర్ లో ఫెయిల్ అయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయనే డిప్రెషన్ తో ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. టీడీపీ నేత రమేష్ మేనల్లుడు కూడా బలయ్యాడు. పిల్లల భవిష్యత్ తో తెలంగాణ ఇంటర్ బోర్డు ఆటలాడిందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తప్పుల తడక మార్కులిస్టులతో విద్యార్ధులను అయోమయంలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.