ఫలితాల్లో పొరపాటు లేదు – ఇంటర్ బోర్డు

  • Published By: madhu ,Published On : April 20, 2019 / 08:50 AM IST
ఫలితాల్లో పొరపాటు లేదు – ఇంటర్ బోర్డు

‘ఇంటర్ పరీక్షల నిర్వాహణ..మూల్యాంకనం..ఫలితాల ప్రకటనలో పారదర్శకత..బాధ్యతతో..తప్పులు లేకుండా చేపట్టాం..విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి’ అంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడిస్తున్నారు.

ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలు తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారి తీస్తున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు రావడం..మరో సబ్జెక్టులో ఫెయిల్ కావడం..పరీక్షలకు హాజరైనా..ఆబ్సెంట్ అయినట్లు మెమోలో ఉండడంతో విద్యార్థులు షాక్ తిన్నారు. ఇంటర్ బోర్డు ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

వారు చేస్తున్న ఆందోళనపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రెస్పాండ్ అయ్యారు. బయటకు వచ్చి..తల్లిదండ్రులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంటర్ బోర్డు ఎలాంటి పొరపాట్లు చేయలేదని..తప్పులు జరిగితే సరిదిద్దేందుకు సిద్ధమన్నారు. అయితే..ఇంటర్‌లో స్టూడెంట్స్ ఫెయిలవటం సహజమని, కొందరు ఫెయిల్ అయితే బోర్డును ఎలా తప్పుబడుతారన్నారు. మెమోల్లోని పొరపాట్లన్నింటినీ సరి చేస్తామని వెల్లడించారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లోని అన్నింటినీ పొందుపరుస్తామని వారికి నచ్చచెప్పారు. బోర్డు కార్యదర్శి చెప్పిన వ్యాఖ్యలతో స్టూడెంట్స్..వారి పేరెంట్స్ సంతృప్తి చెందలేదు. అక్కడే ఆందోళన కొనసాగిస్తున్నారు.