National Education Policy 2020 : త్రిభాషా ఫార్ములా అమలు చేయం…తమిళనాడు సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : August 3, 2020 / 03:22 PM IST
National Education Policy 2020 : త్రిభాషా ఫార్ములా అమలు చేయం…తమిళనాడు సీఎం

నూతన విద్యా విధానానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ 2020)లోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ విధానం తమకు అత్యంత బాధా, విచారాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విధానాన్ని ఎంత మాత్రమూ అమలు చేయమని స్పష్టం చేశారు.



నూతన జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రాన్ని పునఃపరిశీలించాలని ప్రధాన నరేంద్రమోదీకి సోమవారం ఒక ప్రకటనలో పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపీ 2020లో త్రిభాషా సూత్రం మాకు బాధ కలిగించింది. దశాబ్దాలుగా మా రాష్ట్రం ద్వి భాషా విధానాన్నే అనుసరిస్తోంది. దానిలో ఎలాంటి మార్పు ఉండబోదు. అని పళనిస్వామి వ్యాఖ్యానించారు.

నూతన జాతీయ విద్యా విధానంపై తమిళనాడులో రాజకీయ తుఫాను చెలరేగింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్ఈపీని తిరస్కరించాయి. ఇది తమపై బలవంతంగా హిందీ, సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నమంటూ విమర్శించాయి. సారూప్య రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి దీనికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తామని స్టాలిన్‌ ప్రకటించారు. మరోవైపు, పుదుచ్చేరి సీఎం వీ. నారాయణస్వామి కూడా ఎన్‌ఈపీపై అసహనం వ్యక్తంచేశారు.