నీట్-2020 పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

  • Published By: venkaiahnaidu ,Published On : January 1, 2020 / 04:10 PM IST
నీట్-2020 పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

నీట్-2020 ఎగ్జామ్ దరఖాస్తు గడువు తేదీ పొడిగించబడింది. జనవరి 6వ తేదీ రాత్రి 11:50 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హెచ్‌ఆర్‌డీ శాఖ తెలిపింది.  ముందస్తు షెడ్యూల్ ప్రకారం నీట్-2020 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెంబర్ 31, 2019 రాత్రి 11:50 గంటలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మానవవనరుల మంత్రిత్వ శాఖకు దరఖాస్తు గడువును పొడిగించాల్సిందిగా అభ్యర్థనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

వెబ్‌సైట్ పై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని హెచ్‌ఆర్‌డీ తెలిపింది. అయితే ఇతర అంశాలకు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని హెచ్‌ఆర్‌డీ తెలిపింది. అంటే జనవరి 15 నుంచి జనవరి 31 వరకు ఉన్న పలు ప్రక్రియలకు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంపిక చేసిన కొన్ని నోడల్ సెంటర్లలో జమ్మూకశ్మీర్, లేహ్ కార్గిల్‌లో నివాసముంటున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను సబ్మిట్ చేయొచ్చని తెలిపింది.

నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019లోని సెక్షన్ 14 ద్వారా మెడిసిన్ చదవాలనే అభ్యర్థులకు అందరికి ఉమ్మడి పరీక్ష నీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతోంది. ఎయిమ్స్, జిప్‌మర్, లాంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలకు కూడా అడ్మిషన్ నీట్ ద్వారానే జరుగుతుందని అధికారిక నోటిఫికేషన్‌లో తెలిపారు.