హ్యాట్సాఫ్ : ప్లాస్టిక్ వ్యర్థాలే ఆ స్కూల్లో ఫీజులు

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 10:07 AM IST
హ్యాట్సాఫ్ : ప్లాస్టిక్ వ్యర్థాలే ఆ స్కూల్లో ఫీజులు

డిస్పూర్: ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పుడమితల్లి అల్లాడిపోతోంది. ఒక పాలిథిన్ కవర్ భూమిలో కలవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది లెక్కలేనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి అత్యంత భారంగా మారుతోంది. మూగ జీవాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్ ని నిషేధించాలని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ప్లాస్టిక్ నిషేధం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఈ వినియోగం ఇలాగే పెరిగితే భూగోళానికి ప్రమాదం తప్పదు..మనిషి మనుగడ ప్రశ్నార్థంకాక మానదు..భూమిపై నివసించే జీవరాశులు అంతరించిపోక తప్పదు..ఈ ప్రమాదాలన్నింటికీ మనిషే కారణంగా మారుతున్నాడు. దీన్ని నియంత్రించటం అనివార్యం..

ఇంత ప్రమాదానికి దారి తీసే ఈ ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఓ స్కూల్ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అసోంలోని అక్షర్ ఫౌండేషన్ స్కూల్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రతీ స్కూల్ కి ఆదర్శం అనటంలో అతిశయోక్తి కాదు.

స్కూల్లో చదువుకోవాలంటే విద్యార్థులు ఫీజులు కట్టాలికదా. ఈ అక్షర ఫౌండేషన్ కూడా ఫీజులు కట్టించుకుంటుంది. అది డబ్బు రూపంలో కాదు. ఆ స్కూల్లో చదివే చిన్నారుల నుంచి ఫీజుల రూపంలో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల వ్యర్థాలు తీసుకుంటారు. అదేంటి పర్యావరణం కోసం చేసే పని ఇదేనా? అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన విషయం. ఈ స్కూల్లో చదివే చిన్నారులు ఉదయాన్నే పుస్తకాలతోపాటు ఇరుగుపొరుగువారి ఇళ్ల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్కూల్ కి తీసుకువెళతారు.

ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురావాలని విద్యార్థులను కొన్ని నెలల నుంచి కోరుతున్నామనీ..దీనికి ప్రతిగా విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని అక్షర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మజిన్ ముఖ్తార్ తెలిపారు. విద్యార్థులు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇక్కడే రీ సైక్లింగ్ చేస్తున్నామని తెలిపారు. పేదల పిల్లలకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పిస్తూనే..ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించమని చెబుతున్నామన్నారు. ఇలా వారికి అవగాహనతో పాటు పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నామన్నారు.

అంతేకాదు వారికి ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించిన చిన్నారులకు ‘టాయ్ మనీ’ అందిస్తున్నారు. దీంతో వారి అవసరాలు తీరటంతో పాటు వారు చక్కగా చదువుకునేందుకు తోడ్పడుతుందన్నారు. ఈ పాఠశాలలో 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.