ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

  • Published By: veegamteam ,Published On : February 4, 2019 / 07:05 AM IST
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

నేను పోలీస్ అని చెప్పుకునేందుకు కొందరు యువతీయువకులు కలలుగంటారు. యువత కలను నిజం చేసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తుంది. లక్ష్యాన్ని చేరాలన్న తపనకు తోడ్పాటు తోడైతే..గెలుపు తీరాలకు చేరడం మరింత సులువుతుంది.  

రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల్లో భరోసా నింపుతున్నది.  ప్రైవేట్ కోచింగ్‌లో వేలకు వేలు ఫీజులు చెల్లించి శిక్షణ పొందలేని వారికి ఇది వరంలా మారింది. పరుగు, షాట్‌ఫుట్, లాంగ్ జంప్.. ఇలా వివిధ అంశాల్లో చక్కగా శిక్షణ పొందుతూ.. రాటుదేలుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంత చక్కని చేయూతనందిస్తున్న సర్కారు, రాచకొండ పోలీసులకు జేజేలు పలుకుతున్నారు.

రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్ అభ్యర్థులందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేశారు. క్లాస్‌రూంలో శిక్షణ అనంతరం రిటన్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైన 86 మహిళ, 162 మంది పురుషులు మొత్తం 248 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరందరికీ పహాడీషరీఫ్ కేంద్రంగా ఇస్తమా గ్రౌండ్‌లో రోజూ ఉదయం రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హై జంప్, తదితర దేహదారుఢ్య శిక్షణను ఇన్‌స్ట్రక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో సి. గాయత్రి, ఆర్.ఝాన్సీ, కె. అరుణ్‌కుమార్, జి. గణేశ్, లోకేశ్‌కుమార్ మహిళా, పురుష అభ్యర్థులకు వేర్వేరుగా తర్ఫీదునిస్తున్నారు. ప్రతి రోజూ పాలు, గుడ్డు, అరటిపండ్లు అందిస్తున్నారు. కోచ్‌ల ఆధ్వర్యంలో ఎంతో చక్కగా శిక్షణ పొందుతున్నామని, ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌కు, పోలీస్ ఉన్నతాధికారులకు, పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులకు కృతజ్ఙతలు తెలుపుతున్నారు అభ్యర్థులు. పరీక్షల్లో విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.