School Fees : మా పిల్లలకు క్లాసులు చెప్పడం లేదు..ఏడ్చేసిన మధుమిత

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 07:43 AM IST
School Fees : మా పిల్లలకు క్లాసులు చెప్పడం లేదు..ఏడ్చేసిన మధుమిత

School Fees : విద్యార్థులకు సరిగ్గా పరీక్షల సమయంలోనే ఆన్‌లైన్ యాక్సెస్ నిలిపివేస్తున్నారని సినీ నటి మధుమిత (Madhumitha) ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులపై ప్రశ్నించినందుకు తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు (Online Class) చెప్పడం లేదన్నారు. ప్రభుత్వ జీవో 46కి విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు.



50 శాతం మాత్రమే ట్యూషన్ ఫీజు కట్టాలని ప్రభుత్వం ఆదేశించినా.. స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. అన్యాయంగా తమ పిల్లల చదువును నాశనం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు.



పేరెంట్స్ అసోసియేషన్ సంఘానికి సినీ నటుడు శివ బాలాజీ దంపతులు (Siva Balaji Wife Madhumitha) మద్దతు పలికారు. పిల్లల చదువుతో ఆడుకునే ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల తీరుపై మండిపడ్డారు. అంతేకాకుండా ఫీజులపై ప్రశ్నించిన తల్లిదండ్రులను యాజమాన్యం టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. ఇక నుంచి తల్లిదండ్రులు చేసే న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.



తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ (Hyderabad Parents Association) మండిపడింది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహిస్తూ.. తమ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తాయన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.



ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల బెదిరింపులతో పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేరెంట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి.. అధిక ఫీజులతో మోయలేని భారాన్ని వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అధిక ఫీజుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరింది.



కరోనా కష్టకాలంలో కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తల్లిదండ్రుల సంఘం నేతలు మండిపడుతున్నారు. ఫీజుల వసూలుపై ప్రభుత్వం హెచ్చరించినా.. పట్టించుకోవడం లేదన్నారు. దశాబ్ద కాలంగా దోపిడిపై రోడ్ల మీదకు వచ్చి యుద్ధం చేస్తున్నా.. ఫీ రెగ్యులరైజేషన్ పేపర్లకే పరిమితం అయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.