Teacher Posts : టీచర్ల భర్తీ… తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులనే..

Teacher Posts : టీచర్ల భర్తీ… తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

Teacher Posts

Teacher Posts : టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులనే భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు లేని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే, ప్రస్తుతమున్న ఖాళీల్లో సుమారు 2 వేల టీచర్‌ పోస్టులు భర్తీకి నోచుకునే అవకాశం లేదు. విద్యార్థులు లేని స్కూల్స్ లో టీచర్ల భర్తీ ద్వారా ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే విద్యార్థులు లేని స్కూళ్లలోని ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని పాఠశాల ల్లో 2వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు.

ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్థాయిలోనే ఉన్నట్టు తేలింది. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా ఒక్కో టీచరుకు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మంది, హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థులుండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసంధానిస్తారు. అలాగే జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్యా పెరుగుతోంది.