రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ; విద్యాశాఖ కీలక నిర్ణయం

  • Published By: chvmurthy ,Published On : March 4, 2020 / 11:04 PM IST
రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ; విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ లో కరోనా(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసు నమోదయిన నేపథ్యంలో వైరస్‌ విస్తరించకుండా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభ మయ్యాయి. విద్యార్ధుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌ విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలు రాయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా పరీక్ష కేంద్రాలను శుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్లను ఆదేశించింది.  

విద్యార్థులు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడానికి అనుమతిచ్చింది. కాగా దగ్గు, జలుబుతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. జలుబుతో బాధపడే ఇన్విజిలేటర్లకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయించింది. 

కాగా….. మైండ్‌ స్పేస్‌లోని మహిళా ఉద్యోగికి కరోనా వైరస్‌ లేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆ టెకీకి కరోనా వైరస్‌ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఐటీ కారిడర్‌ ఖాళీ కాలేదని, వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటివరకు దేశంలో విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా సోకిందని తెలిపారు. డీఎస్‌ఎమ్‌ ఉద్యోగికి కరోనా వచ్చిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ టెకీ వైద్య పరీక్షల రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్ చెప్పారు. మైండ్‌ స్పేస్‌లోని కంపెనీలన్నీ యథాతథంగా నడుస్తాయని  ఆయన చెప్పారు. వైరస్‌ వచ్చిందని ప్రచారం జరుగుతున్న మహిళ భర్తకు కంపెనీ ప్రతినిధులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో మరో రెండు కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం ఇచ్చాయని అన్నారు.

తెలంగాణలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు ఒక్కటి మాత్రమే నమోదైందని రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. మైండ్‌స్పేస్‌లో పనిచేసే మహిళా టెకీ రిపోర్ట్‌ ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 45 నమూనాలు నెగిటివ్‌గా వచ్చాయని.. ఇద్దరి నమూనాలను మాత్రమే పుణేకు పంపినట్టు తెలిపారు. దాదాపు 81 శాతం మందికి కోవిడ్‌ సోకదని, 14 శాతం మందిలో లక్షణాలు కనిపిస్తాయని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే కేవలం ఐదు శాతం మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని వివరించారు.