B.E.D. Entrance : వారు కూడా బీఈడీకి అర్హులే.. ప్రభుత్వం కీలక సవరణలు

బీఈడీ (బ్యాచ్ లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) కోర్సు ఎంట్రన్స్, ఆడ్మిషన్ల ప్రక్రియలో కీలక సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్ 12,2021) పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వారితో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) పట్టభద్రులు కూడా బీఈడీ చేయొచ్చు.

B.E.D. Entrance : వారు కూడా బీఈడీకి అర్హులే.. ప్రభుత్వం కీలక సవరణలు

B.e.d. Entrance

B.E.D. Entrance : బీఈడీ (బ్యాచ్ లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) కోర్సు ఎంట్రన్స్, ఆడ్మిషన్ల ప్రక్రియలో కీలక సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్ 12,2021) పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వారితో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) పట్టభద్రులు కూడా బీఈడీ చేయొచ్చు. వీరు 50శాతం మార్కులతో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇతర పట్టభద్రుల్లాగే ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారూ బీఈడీ చదవొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇంజినీరింగ్‌ చేసి బీఈడీ చేయాలనుకునే వారికి కనీస అర్హత మార్కులు 50శాతానికి తగ్గించారు.

అన్ని సబ్జెక్టులు చదువుకున్నవారు బీఈడీ చేసుకునే వెసులుబాటును కల్పించేందుకు గాను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం సవరణలు చేసింది.

గతంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్‌తో పట్టభద్రులకు బీఈడీ ప్రవేశపరీక్ష రాసే అవకాశం ఉండేది. బీఈడీ అన్ని మెథడాలజీల కోర్సుల కోసం ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో సీట్ల శాతం, ఆయా మెథడాలజీలకు అర్హతా సబ్జెక్టులను కూడా ఖరారు చేశారు. గణితానికి 25శాతం, ఫిజికల్ సైన్సెస్, బయాలజీకి 30శాతం సీట్లు ఉంటాయి. ఫిజికల్ సైన్సెస్, బయాలజీలో కనీసం పదిశాతం చొప్పున గరిష్ఠంగా 20శాతానికి మించకుండా సీట్లు ఉంటాయి.

సోషల్ సైన్సెస్, ఇంగ్లీష్, ఓరియెంటల్ లాంగ్వేజెస్‌కు 45శాతం సీట్లు ఉంటాయి. ఆంగ్లం, ఓరియెంటల్ లాంగ్వేజెస్‌లో కనీసం 5శాతం చొప్పున రెండింటికీ కలిపి గరిష్ఠంగా 15శాతం వరకు సీట్లు ఉండనున్నాయి. గణితం ఓ సబ్జెక్టుగా బీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారితో పాటు ఇంటర్‌లో గణితం చదివిన బీసీఏ పట్టభద్రులు మాథ్స్ మెథడాలజీకి అర్హులు. బీఎస్సీ, బీఈ, బీటెక్‌లో ఫిజిక్స్\కెమిస్ట్రీ చదివినవారు, ఇంటర్‌లో ఫిజిక్స్\కెమిస్ట్రీ చదివిన బీసీఏ విద్యార్థులకు ఫిజికల్ సైన్సెన్‌లో బీఈడీకి అర్హత ఉంటుంది. బోటనీ\జువాలజీలో బీఎస్సీ చదివిన వారితో పాటు ఇంటర్‌లో బయాలజికల్ సైన్సెస్ చదివిన బీసీఏ విద్యార్థులు బయాలజికల్ సైన్సెస్ మెథడాలజీలో బీఈడీ చేయవచ్చు. సోషల్ సైన్సెస్ సబ్జెక్టుల్లో బీఏ చదివిన వారితో పాటు ఇంటర్‌లో సోషల్ సైన్సెస్ చదివిన బీకాం, బీబీఎం, బీబీఏ, బీసీఏ విద్యార్థులకు బీఈడీ సోషల్ సైన్సెస్ మెథడాలజీలో అర్హత ఉంటుంది.

స్పెషల్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లిటరేచర్‌లో బీఏ చదివిన వారు లేదా ఎంఏ ఇంగ్లీష్ వారికి బీఈడీ ఇంగ్లీష్ మెథడాలజీకి అర్హత ఉంటుంది. తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం భాషల్లో బీఏ, బీఏ లిటరేచర్, బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్ చదివిన వారికి లేదా ఎంఏ పూర్తి చేసిన వారికి ఓరియెంటల్ లాంగ్వేజెస్ బీఈడీకి అవకాశం ఉంటుంది. అన్ని మెథడాలజీలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో అర్హతా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించనున్నారు.