ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 03:53 AM IST
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు విద్యార్థులకు శాపంగా మారిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్  అయ్యామనే మనస్తాపంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు దుమారం రేపాయి. ఇంటర్ బోర్డు అధికారుల వైఖరికి నిరసనగా ఆందోళనలు జరిగాయి. దీనిపై  ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పందించారు. ఇంటర్‌ ఫలితాల్లో పొరపాట్ల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆయన తేల్చి చెప్పారు. ఆత్మహత్య  చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలను ఇంటర్‌ బోర్డు పరిశీలించగా ఫలితాల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లకు, ఆత్మహత్యలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడైందని ఆయన స్పష్టం చేశారు.

ఆత్మహత్యలకు పాల్పడిన, యత్నించిన 53మంది విద్యార్థుల జవాబుపత్రాలను నిశితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ నిర్వహించగా చెప్పుకోదగ్గ తప్పిదం జరిగినట్టు తేలలేదని అశోక్ స్పష్టం  చేశారు. ఫలితాల ప్రకటన కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు చెప్పడానికి గల తప్పిదం రీ-వెరిఫికేషన్‌లో కానీ రీ-కౌంటింగ్‌లో కానీ బయటపడలేదని చెప్పారు. గ్లోబరీనాతో పాటు  టెక్ మెథడక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వేర్వేరుగా 12 కేంద్రాల్లో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాలను దిద్దినట్టు అశోక్ చెప్పారు. ఈ రెండు సంస్థలు నిర్వహించిన  రీ-వెరిఫికేషన్..రీ-కౌంటింగ్‌లో ఫలితాలు ఒకేలా ఉన్నాయని వివరించారు. ఆత్మహత్యకు పాల్పడిన 25మంది విద్యార్థుల్లో 10మంది విద్యార్థులు ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ కాగా 12 మంది విద్యార్థులు  ఒకటికి మించిన సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని చెప్పారు. ముగ్గురు విద్యార్థులు పాస్ అయినా ఆత్మహత్యకు పాల్పడినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు.

85శాతం మార్కులు వచ్చినా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అశోక్ చెప్పారు. మరో విద్యార్థిని పరీక్ష రాసి ఫెయిల్‌ అవుతామన్న ఆందోళనతో ఆత్మహత్య చేసుకుందన్నారు. కానీ ఆ విద్యార్థి  అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యినట్టు చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాల రీ-వెరిఫికేషన్.. రీ-కౌంటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. మే 10వ తేదీ లోగా ఫలితాలను  ప్రకటిస్తామన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత 15 రోజులకు స్కాన్ చేసిన జవాబు పత్రాలు ఇస్తామన్నారు. ఫలితాల్లో తప్పుల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వేలాది మంది  ఫెయిల్‌ అయ్యారని మీడియా అసత్య ప్రచారం చేస్తోందని అశోక్ మండిపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతంలోనూ పెద్దగా వ్యత్యాసం లేదన్నారు. విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు  తీసుకోకుండా వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.