ఇంటర్ రగడ : రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

  • Published By: madhu ,Published On : April 25, 2019 / 01:58 AM IST
ఇంటర్ రగడ : రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. ఇంటర్ ఫలితాల వివాదంలో విమర్శలు చుట్టుముట్టడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు ఇవాళ కాంగ్రెస్‌ ధర్నాలకు సిద్ధమవ్వగా…గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు అఖిలపక్షలం రెడీ అయింది. SFI కార్యకర్తలు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంటర్‌  కార్యాలయం వద్ద ఆందోళన దిగిన విద్యార్థి సంఘాల కార్యకర్తలు, రాజకీయ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అటు ఇంటర్‌ ఫలితాల వివాదానికి కేంద్ర బిందువైన గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

ఇంటర్ ఫలితాల వివాదంలో.. విమర్శలు చుట్టుముట్టడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరీక్షా ఫలితాల అనంతరం విద్యార్ధుల, తల్లిదండ్రులు ఆందోళనలకు దిగడం, విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడడంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం 30శాతం విద్యార్ధులు ఫెయిల్ అవ్వడం సహజమని, ఈ విడత మరింత ఎక్కువ మంది ఫెయిల్‌ కావడంతో.. విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో అపోహలకు కారణమైందని అధికారులు సీఎంకు వివరించారు.

ఫెయిల్ అయిన విద్యార్ధులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఉచితంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పాస్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే ఇంటర్‌ పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంది. ప్రభుత్వ తీరును నిరసనగా ఏప్రిల్ 25వ తేదీ గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై అఖిలపక్షం నేతలు గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ కానున్నారు. మొత్తంగా ఇంటర్మీడియట్ ఫలితాల అంశం చినికి చినికి గాలి వానగా మారుతోంది.