ఇంటర్ రిజల్ట్స్‌లో 0 మార్కులు..రీ వాల్యుయేషన్‌లో 99 మార్కులు

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 11:06 AM IST
ఇంటర్ రిజల్ట్స్‌లో 0 మార్కులు..రీ వాల్యుయేషన్‌లో 99 మార్కులు

తెలంగాణ ఇంటర్ అధికారుల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిజల్ట్స్‌ చూస్తే సున్నా మార్కులు..రీ వాల్యుయేషన్ చేసుకుంటే 99 మార్కులు వచ్చాయి. ఇది మంచిర్యాల జిల్లాలో జరిగింది. పాస్ అయిన వారు కూడా ఫెయిల్ అయ్యారని.. పరీక్షలకు హాజరైనా ఫెయిల్ అయినట్లు మెమోలో ఉండడంతో షాక్ తింటున్నారు స్టూడెంట్స్. అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో దీనిని బట్టి తెలుస్తుంది. 

జన్నారం మండలం చింతగూడెంకు చెందిన నవ్య సీఈసీ చదువుతోంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసింది. ఫస్టియర్ లో ఆమె జిల్లా టాపర్. సెకండియర్ ఫలితాలు చూసుకున్న నవ్య ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తెలుగు సబ్జెక్టులో సున్నా మార్కులు వచ్చాయి. దీనితో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఫస్టియర్ లో జిల్లా టాపర్ సెకండియర్ లో ఫెయిల్ కావడం ఏంటని అంతా షాక్ తిన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ కూడా విస్మయం చెందారు. 99 మార్కులు వేయబోయి సున్నా మార్కులు వేసి ఉంటారని, రీ వాల్యుయేషన్ చేసుకుంటే సరిపోతుందని ప్రిన్సిపాల్ ధైర్యం చెప్పారు. ప్రిన్సిపాల్ చెప్పినట్టే జరిగింది. నవ్య రీ వాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకోగా, ఆమెకి 99 మార్కులు వచ్చాయి.

దీంతో ఇంటర్ బోర్డు అధికారుల వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్లు కనిపింది. సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఫస్టియర్, సెకండియర్ పరీక్షా ఫలితాలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ అయినట్లు..డిస్ట్రిక్ టాపర్ ఫెయిల్ అయినట్లు..ప్రతి సబ్జెక్టులో 95 మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో మాత్రం 4 మార్కులతో రిజల్ట్స్ వచ్చాయి. దీంతో విద్యార్థులు..వారి పేరెంట్స్ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే.. తమ తప్పేమీ లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి చెప్పడం గమనార్హం.