పోలీస్ జాబ్స్ : 18 వేల ఉద్యోగాలు 3 లక్షల మంది అభ్యర్థులు

10TV Telugu News

హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల్లో భాగంగా అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 40 రోజుల పాటు జరుగనున్నాయి. మొత్తం 18వేల ఉద్యోగాల కోసం 3 లక్షల మంది హాజరు కానున్నారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాలు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

గత డిసెంబర్ 17 నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌కు పూర్తి కావాల్సి ఉంది. అయితే…ఎస్ఐ అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కడంతో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి అధికారులు ఈ పరీక్షలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయనేది అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందించారు. ఒక్కో కేంద్రంలో వందలాది మంది అభ్యర్థులు రానుండడంతో ఎలాంటి సంఘటనలు జరుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడనున్నారు.