eggs free for plastic

కొత్త స్కీమ్ : ప్లాస్టిక్ ఇస్తే గుడ్లు ఫ్రీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించి ఇస్తే అర

కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించి ఇస్తే అర డజన్‌ గుడ్లు ఉచితంగా ఇస్తామని కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 4వ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి గ్రామపంచాయతీతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ప్లాస్టిక్ నిర్మూలనకు సంబంధించి శనివారం(నవంబర్ 2,2019) అధికారులతో కలెక్టర్ భేటీ అయ్యారు. ప్లాస్టిక్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అందులో భాగంగా గుడ్లు ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చారు. మండల రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ పథకానికి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యానర్లు సిద్ధం చేసి ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. 

2 కిలోల ప్లాస్టిక్‌ను ఏరి తీసుకొచ్చిన వారికి స్థానికంగా ఉండే కిరాణ షాపుల ద్వారా గుడ్లను ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు, రెడ్‌క్రాస్‌ సభ్యులు బృందాలుగా ఏర్పడి పర్యవేక్షించాలని సూచించారు.

కలెక్టర్ ప్రకటించిన ఈ ఆఫర్ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. భలే మంచి ఆఫర్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. కాగా, తెలంగాణలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను రాష్ట్రంలో నిషేధించాలని ఇటీవలే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని దేశవ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తితో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం ఒకసారి వాడిపడేసిన ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వేల ఏళ్లు పడుతుంది. రీసైక్లింగ్ చేయడం వల్ల వచ్చే విషవాయువులు పర్యావరణంతోపాటు ప్రజలకు హానికారంగా మారుతున్నాయి. చెరువులు, కుంటలు, నదులు, సముద్ర తీరప్రాంతాలన్నీ ప్లాస్టిక్‌తో విపరీతంగా నిండిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ముఖ్యంగా నీటిలో ఉండే జలచరాలతోపాటు, సాధు జంతువులకు కూడా ప్లాస్టిక్ ప్రాణాంతకంగా మారింది. సముద్రాల్లో ప్లాస్టిక్ మూలంగా జలచరాల సంఖ్య తగ్గిపోతోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నది.

READ  దేశరక్షణ కోసం మళ్లీ గెలిపించండి :  పాలమూరు లో మోడీ

ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రోజుకు సుమారు 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తాయి. నాలాలు, చెరువుల్లో వేసేవి మరో వంద టన్నుల వరకు ఉంటాయి. ప్లాస్టిక్ కవర్లు, సీసాలతో నాలాలు మూసుకుపోతున్నాయి. దీని వల్ల జంట నగరాల్లో కొంచెం వానపడ్డా రోడ్లు పొంగిపొర్లే పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి గతంలోనే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌పై ఇప్పటికే నిషేధం ఉంది.

Related Posts