బ్రేకింగ్.. హైదరాబాద్‌లో రూ.10వేల పంపిణీ బంద్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

flood relief assistance: గ్రేటర్ హైదరాబాద్ లో(ghmc) వరద సాయం కింద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న రూ.10వేల సాయాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తక్షణమే వరద సాయం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. దరఖాస్తుల స్వీకరణ, డబ్బు పంపిణీ నిలిపివేయాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన  తర్వాత అంటే డిసెంబర్ 4 తర్వాత వరద బాధితులకు సాయాన్ని యథావిధిగా కొనసాగించ వచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఎస్ఈసీ.

హైదరాబాద్‌ మహానగరాన్ని గత నెలలో భారీ వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వానలు నగరాన్ని ముంచెత్తాయి. చాలా కాలనీలు నీట మునగడంతో నగరవాసులు నరకం చూశారు. ప్రజలు ఎంతో నష్టపోయారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.

వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం, ఇల్లు పూర్తిగా దెబ్బతింటే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఎంతో మంది వరద సాయం అందుకున్నారు. అయితే చాలా కాలనీల్లోని వరద బాధితులకు మాత్రం ఇప్పటికీ సాయం అందలేదు. వారంతా ఆందోళనలు చేస్తున్నారు. తమకు రావాల్సిన డబ్బును కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు కాజేశారని ఆరోపిస్తున్నారు. కొందరికి మాత్రమే ఇచ్చారని… అసలైన వరద బాధితలను పట్టించుకోలేదని వాపోతున్నారు. కొంతమందికే డబ్బులిచ్చి.. మిగతా వారికి ఎందుకు ఇవ్వడం లేదని జీహెచ్ఎంసీపై వరద బాధితులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో.. మా కాలనీకి వచ్చినప్పుడు.. మీ సంగతి తేలుస్తాం.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో వరద సాయంపై మంత్రి కేటీఆర్ మరింత క్లారిటీ ఇచ్చారు. వరదసాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 4,75,871 కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.475 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఇప్పటికీ వరద సాయం అందని వారు మీ-సేవ సెంటర్లలో పేర్లు, ఇంటి వివరాలు, ఆధార్‌ నంబర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయం అందిస్తారని చెప్పారు. అర్హులైన వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తారని వెల్లడించారు. మంత్రి ప్రకటనతో సాయం అందని వరద బాధితులు మీసేవా కేంద్రాలకు పోటెత్తారు. దీంతో నగరంలో ఏ మీ సేవ కేంద్రం ముందు చూసిన వందలాది మంది కనిపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల తోపులాటలు సైతం జరిగాయి. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 గంటలకు పైగా మీ సేవ కేంద్రం దగ్గర క్యూ నిల్చుకున్న వృద్ధురాలు చనిపోయింది.

Related Tags :

Related Posts :