Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఐదు ప్రధాన కారణాలు ఇవే

పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓట్ శాతంలోనూ కాంగ్రెస్ ఊహించని స్థాయిలో విజయం సాధించేట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 43 శాతం ఓట్లు కాంగ్రెస్ వెనకేసుకుంది

Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఐదు ప్రధాన కారణాలు ఇవే

Congress Victory: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ధుంధుబి మోగిస్తోంది. మెజారిటీ మార్కును దాటి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండు చూస్తుంటే 130 కి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచేలాగానే కనిపిస్తోంది. కాగా, ఆ పార్టీకి ఇప్పటికే నాలుగు స్థానాల్లో విజయం ఖాయమైంది. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓట్ శాతంలోనూ కాంగ్రెస్ ఊహించని స్థాయిలో విజయం సాధించేట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 43 శాతం ఓట్లు కాంగ్రెస్ వెనకేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ విజయం సాధించడానికి గల కారణాల గురించి చర్చించుకుంటే..

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించిన ఐదు ప్రధాన అంశాలు
1. కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యం
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధాన సమస్య పార్టీ నేతల్లో ఐకమత్యం లేకపోవడం. ఈ కారణం చేతనే పార్టీ అనేక ఎన్నికల్లో ఓటమిని చవి చూస్తూ వస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు చాలా ఎక్కువ. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండే పరిస్థితులు కాంగ్రెస్ నేతల మధ్య కనిపించవు. వారి పట్టింపుల ముందు పార్టీ కూడా చిన్నదైపోతుంది. కానీ కర్ణాకట కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ పార్టీ పరంగా వారి ఐక్యత కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. అంతే కాకుండా ఎన్నికల్లో వారి నాయకద్వయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును ఇచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు ఇది ప్రధాన కారణంగా నిలిచింది.

UP Civic Polls: కర్ణాటకలో ఓడినా యూపీలో దుమ్ము లేపుతున్న బీజేపీ

2. సిద్ధరామయ్య గత పాలనపై ప్రజల్లో విశ్వాసం
ఇక కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రధాన కారణాల్లో ఒకటి సిద్ధరామయ్య 2013-2018 పాలన. సిద్ధూ హయాంలో రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు బాగా అమలయ్యాయనే పేరు ఉంది. పైగా సిద్ధరామయ్య పేదల పక్షపాతి, నిష్పాక్షిక రాజకీయ నాయకుడనే పేరు ప్రజల్లో బాలంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ సిద్ధరామయ్యనే పెద్ద నాయకుడు. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బాగా కలిసి వచ్చింది. ఇదే సమయంలో బీజేపీలో సిద్ధరామయ్యను ఎదురు నిలిచే నాయకుడు లేకపోవడం బీజేపీకి పెద్ద లాస్‭గా మారింది.

Karnataka Polls: సౌత్ ఇండియా నుంచి బీజేపీ ఔట్..! ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట హవా

3. బొమ్మై ప్రభుత్వంపై వ్యతిరేకత
కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అధికార పార్టీ తప్పిదాలు బాగా ఊతం ఇచ్చాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణల కారణంగా బొమ్మై ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 40% కమిషన్ ప్రభుత్వం అనే విపక్షాల నినాదం బలంగా పని చేసింది. విపక్షాలు చేసిన అవినీతి ఆరోపణలను బీజేపీ ప్రభుత్వం తిప్పికొట్టలేకపోయింది. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలతో పలువురు నేతలు కోర్టు విచారణలు బలంగా ఎదుర్కోవడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో పత్తా లేని ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ హోదా వచ్చిన మొదటి ఎన్నికల్లోనే దారుణ ఓటమి

4. బీజేపీలో కుమ్ములాటలు
అసలే అవినీతి ఆరోపణలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రభుత్వానికి పార్టీలో కుమ్ములాటలు కూడా బాగా దెబ్బ పడ్డాయి. పెద్ద సంఖ్యలో సిట్టింగులకు టికెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో ఉన్న సీనియర్ నేతలను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించడం వంటి వాటి వల్ల పార్టీతో తిరుగుబాటులు తీవ్ర స్థాయికి చేరాయి. వీటిని అదుపు చేయడంలో బీజేపీ అధిష్టానం దారుణంగా విఫలమైంది. పార్టీకి పెద్ద ముఖంగా ఉన్న యడియూరప్పను పక్కన పెట్టేయడం కాషాయ పార్టీని బాగా దెబ్బ తీసింది. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగదీష్ షెట్టర్ వంటి నేతలు టికెట్లు రాక పార్టీలు మారడం, వారు చేసిన వ్యతిరేక ప్రచారం బీజేపీని నిండా ముంచింది.

Karnataka Polls: 1999, 1989 ఎన్నికల రికార్డులను బద్దలు కొడుతూ ఘన విజయం దిశగా కాంగ్రెస్

5. కర్ణాటక ప్రజల ఆనవాయితీ
కర్ణాటక ఓటర్లకు ఒక సంప్రదాయం ఉంది. ప్రతి ఐదేళ్లకు వారు ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు. వాస్తవానికి కర్ణాటకలో ఐదేళ్లు కొనసాగిన ప్రభుత్వాలు పెద్దగా లేకపోయినప్పటికీ.. ప్రతి ఐదేళ్లకు ఒసారి జరిగే ఎన్నికల్లో మాత్రం ప్రజల తీర్పు మాత్రం పార్టీ మార్పుపై స్పష్టంగా ఉంటుంది. 1985 అనంతరం ఏ పార్టీ వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించలేదు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికలోనూ కన్నడ ప్రజలు పార్టీని మారుస్తూనే వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా కన్నడిగులు అదే తీర్పును ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఇది కూడా ఒక కారణం.