వైసీపీ ఫైర్ బ్రాండ్‌కు సొంత పార్టీలోనే పెరుగుతున్న శత్రువులు, రీసెంట్ గా మరో ముఖ్య నేతతో విభేదాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

mla roja: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య సంబంధాలు బాగా లేవు. వీరిద్దరి మధ్య విభేదాలపై పార్టీలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకు కూడా వెళ్లింది. ఎప్పటికప్పుడు వీరి మధ్య వివాదాలు సద్దుమణుగుతున్నట్టుగా కనిపిస్తున్నా.. మళ్లీ మళ్లీ తెరపైకి వస్తోంది. రోజాకు సొంత పార్టీలోనే శత్రువులు రోజు రోజుకు పెరుగుతున్నారని చెబుతున్నారు. మొన్నటి దాకా చెట్టపట్టాలేసుకుని తిరిగిన కొందరు ముఖ్య నేతలతో ఇప్పుడు ఆమెకు విభేదాలు మొదలయ్యాయని అంటున్నారు.

రోజా, కేజే వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు:
నగరికి చెందిన పార్టీ నేత కేజే కుమార్ దంపతులతో రోజాకు అస్సలు పడటం లేదని టాక్‌. కొంత కాలంగా వీరి మధ్య నగరిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. మొన్నటి స్థానిక పోరులోనూ రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో కేజే అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారు. కేబీఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజకి వెళ్లిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా ఓ వర్గం వైసీపీ నేతలు రోజాను అడ్డుకున్నారు. అప్పటి నుంచి రోజా, కేజే వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

అక్కా చెల్లెళ్లులా మెలిగిన రోజా, శాంతి:
వైసీపీ ఆవిర్భావం నుంచి కేజే కుమార్.. జగన్ వెంట నడుస్తున్నారు. స్థానికంగా గట్టి పట్టున్న నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేజే కుమార్ 2004-09 మధ్య కాలంలో మున్సిపాలిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2014-19 వరకు ఆయన సతీమణి శాంతి మునిసిపల్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రోజా, కేజే దంపతులు చాలా సన్నిహితంగా మెలిగారు. 2014 ఎన్నికల్లో రోజా గెలుపు కోసం కేజే వర్గం చాలా కష్టపడింది. రోజా, శాంతిలు అక్కా చెల్లెళ్లులా మసలేవారు. గత ఏడాది ఎన్నికల తర్వాత వీరి మధ్య తీవ్రమైన విభేదాలు మొదలయ్యాయి.

కేజే కుమార్‌ దంపతులు, రోజా మధ్య ఆధిపత్య పోరు:
ఎన్నికల ముందు మొదలైన వివాదం ఇప్పుడు కేజే కుమార్‌ దంపతులు, రోజా మధ్య ఆధిపత్య పోరుగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డికి కేజే దంపతులు దగ్గరయ్యారని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఇటీవల కేజే దంపతుల ఇంటికి వెళ్లారు. ఆ తర్వాతి పరిణామాలపై రోజా గుర్రుగా ఉన్నారట. తన వ్యతిరేకులను పెద్దిరెడ్డి చేరదీస్తున్నారని తన సన్నిహితుల దగ్గర రోజా వాపోతున్నారు.

శాంతికి పదవి రావడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారని నమ్మకం:
ఈ వివాదం కొనసాగుతుండగానే కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయమైంది. దీంతో ఎమ్మెల్యే రోజాకు మరింత చిర్రెత్తుకొచ్చినట్లు చెబుతున్నారు. ఆమెకు ఈ పదవి రావడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారని రోజా బలంగా నమ్ముతున్నారట. ఈ వ్యవహారంపై నేరుగా సీఎం జగన్ వద్దే తేల్చుకోవాలని రోజా భావిస్తున్నారు. మొత్తం మీద రోజాకు మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన ఝలక్‌పై ఇప్పుడు జిల్లా అంతటా చర్చ నడుస్తోందట. సొంత పార్టీ నేతల నుంచే రోజాకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Related Tags :

Related Posts :