కరోనాతో మరో తెలుగు నేత కన్నుమూత, ఆయన ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు నిన్న(ఆగస్టు 3,2020) కరోనా పరీక్ష చేయించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. రాజయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజయ్య మృతితో స్వగ్రామం వీఆర్‌పురం మండలం సున్నం వారి గూడెంలో విషాదం నెలకొంది.

10 రోజుల క్రితం జ్వరం:
పది రోజుల క్రితం సున్నం రాజయ్యకు జ్వరం రావడంతో ఆయనకు సొంతూరు సున్నంవారి గూడెంలో చికిత్స అందించారు. కరోనా టెస్టు చేయగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. సోమవారం భద్రాచలంలో మరోసారి టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. రాష్ట్ర విభజన తర్వాత పాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. రాజయ్య సొంతూరు ఆంధ్రాలో ఉండటంతో.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడారు.

ఆటోలో, బస్సులో అసెంబ్లీకి.. అన్న క్యాంటీన్ల దగ్గర భోజనం:
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన రాజయ్య నిరాడంబరమైన జీవితం గడిపారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సుల్లో వెళ్లారు. హైదరాబాద్ వీధుల్లో అన్న క్యాంటీన్ల దగ్గర భోజనం చేసి కడుపు నింపుకునేవారు. కోవిడ్ నిబంధనల మేరకు రాజయ్య స్వగ్రామం సున్నంవారి గూడెంలో అంత్యక్రియలు జరగనున్నాయి. రాజయ్య మృతితో కుటుంబసభ్యుల్లో విషాదం అలుముకుంది. ఇప్పటికే ఏపీలోనూ కరోనా కారణంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు చనిపోయారు. కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మాణిక్యాల రావు కన్నుమూశారు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలను బలి తీసుకుంది. యూపీలో సీఎం యోగి కేబినెట్ లో మంత్రి కమల్ రాణి కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

రాజకీయ ప్రముఖులపై కరోనా పంజా:
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ కాటేస్తోంది. రాజకీయ ప్రముఖులను కూడా వదలడం లేదు. కర్ణాటక సీఎం యడియూరప్పకు కూడా కరోనా సోకింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్ కూడా కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కరోనా బారిన పడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో, కరోనా కారణంగా తృణమూల్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ (60) కన్నుమూసిన విషయం విదితమే.

Related Posts