కంగనా ఇంటిబైట ముంబై పోలీసుల సెక్యూరిటీ, ఉద్ధవ్‌కు వార్నింగ్ ఎంత దూరం వెళ్తుంది?

  • Published By: murthy ,Published On : September 10, 2020 / 12:26 PM IST
కంగనా ఇంటిబైట ముంబై పోలీసుల సెక్యూరిటీ, ఉద్ధవ్‌కు వార్నింగ్ ఎంత దూరం వెళ్తుంది?

Kangana Ranaut vs Shiv Sena: రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోపే, ముంబై నగరాన్ని మరో అంశం టెన్షన్‌ పెట్టింది. బుధవారం నాటి కంగనా రనౌత్‌ ఎపిసోడ్ ముంబైలో ఉద్రిక్తతలు పెంచింది.

కంగనా రనౌత్‌ నివాసం ఆవరణలో అనుమతుల్లేని నిర్మాణాలున్నాయంటూ బృహణ్ ముంబై కార్పొరేషన్‌ కూల్చివేతలు మొదలుపెట్టడం, హైకోర్టు ఆదేశాలతో అవి మధ్యలో నిలిచిపోవడం, ఆ విషయంలో శివసేన కంగనాపై విరుచుకుపడటంలాంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అటు సుశాంత్‌ మృతి కేసులో కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుంటే ఈ కూల్చివేత ఇంత ఆదరా బాదరాగా జరిగేది కాదు.




ఇటీవలకాలంలో శివసేనపై, ముంబై మహా నగరంపై కంగనా చేస్తున్న కామెంట్స్‌ ఆ పార్టీకి కోపం తెప్పిస్తున్నాయి. సుశాంత్‌సింగ్‌ కేసులో ముంబై పోలీసుల వ్యవహారశైలిని ఆక్షేపిస్తూ ఆ నగరాన్ని కంగనా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారు. ఇక్కడ బతకాలంటే భయంగా వుందని వ్యాఖ్యానించారు. శివసేన ఆమెపై నోరు పారేసుకుంది. తన ప్రాణాలకు ముప్పువుందంటూ ఆమె కేంద్రానికి విన్నవించుకుని, వై ప్లస్‌ సెక్యూరిటీ కూడా సాధించుకున్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసినప్పుడు శివసేన ప్రతీకారం ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అధికారంలో లేకుంటే శివసేన భౌతిక దాడులకు పాల్పడేదన్న ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి, ఆ పవర్‌తోనే చేతనైంది చేస్తోంది. ఇందులో భాగమే కంగనా కార్యాలయం కూల్చివేత.


కంగనా బంగ్లాలో కొన్ని అక్రమ నిర్మాణాలున్నాయని బీఎంసీ సోమవారం ఆమెకు నోటీసులు జారీ చేసింది. అది అవాస్తవమని ట్విటర్‌లో కంగనా జవాబిచ్చారు. ఆమె సిబ్బంది కూడా బీఎంసీకి లిఖితపూర్వక సమాధానం పంపారు. అది అందుకున్న వెంటనే బీఎంసీ కూల్చివేత మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి స్టే రావడంతో కూల్చివేత తాత్కాలికంగా నిలిచిపోయింది. ముంబై హైకోర్టు… బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వివరణ ఇవ్వాలని కోరింది.



తన కార్యాలయాన్ని కూల్చేయడంపై కంగనా రనౌత్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటుగా స్పందించారు. మూవీ మాఫియాతో జట్టుకట్టి తనపై పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ రోజు నా ఇంటిని కూల్చిశారు. రేపు మీ అహంకారం అలానే కూలిపోతుందని అన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, అది నిత్యం పరిగెడుతూనే ఉంటుందనేది గుర్తుంచుకోండని ఉద్ధవ్‌ ఠాక్రేను ఆమె హెచ్చరించారు. అంతేకాదు అయోధ్యపైనే కాదు, కశ్మీరీ పండిట్లపైనా సినిమా తీస్తానని ఆమె స్పష్టం చేశారు.

కంగనాకు మద్ధతు లభిస్తోంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ఆమెకు మద్ధతునిచ్చారు. కంగనా ఆత్మస్థయిర్యంతో నడచుకోవాలని, ఈ కష్టకాలంలో తాము ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


కంగనా, శివసేన మధ్య నెలకొన్న వివాదంపై ఆర్‌జీవీ కూడా డిఫరెంట్‌గా స్పందించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, మహారాష్ట్రకు కంగనాయే తదుపరి సీఎం అనిపిస్తోందని ట్వీట్ చేశారు. అదే గనుక జరిగితే బాలీవుడ్‌ అంతా టింబక్‌టూకు మకాం మార్చాలని పోస్ట్‌ చేశారు. కరోనా సోకిన భారత్‌కు, కంగన సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదని మరో ట్వీట్ చేశారు.