లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

సేవ పేరుతో కొత్త రకం దందా, ఆదుకోండి అంటూ పోస్టులు పెట్టి కోటీశ్వరులయ్యారు

Published

on

కేటుగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఫ్రాడ్స్ గురించి విన్నాము. ఇప్పుడు సేవ పేరుతోనూ చీటింగ్ చేస్తున్నారు కొందరు నీచులు. పేదల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఓ ఎన్జీవో ఘరానా మోసానికి పాల్పడింది. కోట్ల రూపాయలు దండుకుంది. చివరికి వారి పాపం పండి పోలీసులకు దొరికిపోయారు. డబ్బులు ఇచ్చిన దాతల ఫిర్యాదుతో బుధవారం(జూలై 29,2020) పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

హుమాయున్‌నగర్‌కు చెందిన సల్మాన్‌ఖాన్‌(29), బోరబండకు చెందిన సయ్యద్‌ అయూబ్‌(31)లు మార్చిలో ‘హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదల దయనీయ గాథలను వీడియోలుగా రూపొందించి.. దాతలు ఆదుకోవాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసేవారు. ఆ పోస్టులు చూసిన కొంతమంది వ్యక్తులు చలించిపోయేవారు. అయ్యో పాపం అని చేతనైన డబ్బు సాయం చేసేవారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు బాధితులకు కొంత డబ్బు ఇచ్చి మిగతాది వాళ్లు నొక్కేసేవారు. అలా సుమారు కోటి రూపాయలు ఆ ఇద్దరు నొక్కేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

నర్కిపూల్‌బాగ్‌కు చెందిన యాస్మీన్‌ సుల్తానా(50) మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, ఆమె నలుగురు కూతుళ్లను ఆదుకోవాలని జూలై 19న వీడియో పోస్టు చేశారు. యాస్మీన్‌ వదిన అస్రాబేగం బ్యాంకు అకౌంట్, గూగుల్‌పే నంబర్లు ఇచ్చారు. దాతల నుంచి రూ.45 లక్షలు వచ్చాయి. జూలై 22న యాస్మీన్‌ చనిపోయింది.

ఇదే అదనుగా అస్రాబేగం ఖాతా నుంచి సల్మాన్‌ఖాన్‌ రూ.15 లక్షలు తన అకౌంట్‌లోకి, మరో రూ.15 లక్షలు సయ్యద్‌ అయూబ్‌ బంధువు మోహియుద్దీన్‌ రషీద్‌ అకౌంట్‌లోకి బదిలీ చేశాడు. మరో రూ.15లక్షలు అస్రాబేగం ఖాతాలో ఉన్నాయి. దాతలు వివరాలు తెలుసుకోగా బాధితులకు డబ్బు చేరలేదని తేలింది. మోసం చేస్తున్నారని తెలుసుకున్న బార్కస్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంజాగుట్ట, అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి, హుమాయున్‌నగర్‌ పోలీస్ స్టేషన్ లలోనూ ఫిర్యాదులందాయి.

రంగంలోకి దిగిన పోలీసులు సల్మాన్‌‌, సయ్యద్‌ అయూబ్‌లను అరెస్టు చేశారు. ఇక పరారీలో ఉన్న అస్రాబేగం, మోహియుద్దీన్‌ రషీద్‌ల కోసం గాలిస్తున్నారు. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. సల్మాన్, అయూబ్ లు సేవ పేరుతో సుమారు కోటి రూపాయలు దాతల నుంచి దండుకున్నట్లు గుర్తించారు. ఈ ఘరానా మోసం గురించి తెలిసి దాతలు విస్తుపోయారు. ఆఖరికి సేవ పేరుతోనూ చీటింగ్ చేస్తుండటం తట్టుకోలేకపోతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇటువంటి వ్యక్తుల వల్ల నిజంగా ఆపదలో ఉన్న వారికి కూడా సాయం అందే పరిస్థితులు పోతాయన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *