చీకటిని గెలిచిన యామిని : చదువు కోసం అంతులేని వివక్షను జయించి గిరిజన యువతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అంతులేని వివక్షలను ఎదరీది ఎదగాలంటే కాళ్లల్లో కస్సున దిగే ముళ్లను ఏరిపారేయాలి. కాళ్లకు తగిలే రాళ్లను పునాది రాళ్లుగా చేసుకుని ఎదురెళ్లాలి. బరితెగించి తిరుగుతోందని తనను తరిమే వాళ్లను స్నేహితులుగా తలచి ముందుకు సాగిపోవాలి. ఈ మాటల్నే నమ్మింది ఓ గిరిజన యువతి. యామిని. యామిని అంటే చీకటి. తన పేరులోఉండే చీకటిని తన జీవితంలో ఉండకూడదనుకుని నిర్ణయించుకుంది. తన జీవితంలోనే కాదు ఏ ఆడపిల్ల జీవితంలో కూడా ఉండకూడనుకుంది. అందుకోసం ముందడగు వేసింది. ఈటెల్లాంటి మాటల్ని పట్టించుకోలేదు. ఎన్నో వివక్షల్ని..అణచివేతల్ని ఎదుర్కొని ఈరోజు మహిళలు సాధిస్తున్న సాధికారతలను గుర్తు తెచ్చుకుంది. ఎన్ని కష్టాలు వచ్చిన వెనుతిరగలేదు. తాను అనుకున్నది సాధించింది ఈ గిరిజన అమ్మాయి యామిని.

ఒడిశాలోని నౌపడా జిల్లాలోని సునబెడ అనే కుగ్రామంలో చకోటియా భుంజియా అనే గిరిజన తెగ కుటుంబంలో పుట్టింది యామిని. ఆ తెగలో ఆడపిల్లలపై అంతులేని వివక్ష కొనసాగుతోంది. ఈ తెగలోని ఆడపిల్లలు ఇల్లు దాటి బైటకెళ్లకూడదు. చదువుకోకూడదు. అంతేకాదు రంగు రంగుల బట్టలు వేసుకోకూడదు. తెల్లని బట్టలు మాత్రమే వేసుకోవాలి. చెప్పులు కూడా వేసుకోకూడదు.జుట్టు వేసుకుంటూ ముడి వేసుకోవాలి..లేదా అలా వదిలేయాలి..అంతే తప్ప రకరకాల జడలు వేసుకోకూడదు..ఇలా చకోటియా భుంజియా తెగలో ఆడపిల్లలపై అంతులేని ఆంక్షలు. ఆ ఆంక్షల్ని పాటించకపోతే తెగనుంచి వెలివేస్తారు. కఠినమైన శిక్షలు వేస్తారు.

ఆ ఆంక్షల్ని అణచివేయాలనుకుంది చదువంటే ఎంతో ఇష్టపడే యామిని. చదువంటే ప్రాణం యామినీకి. చదువుకోవటం కోసం తన ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరవాలేదనుకుంది. చదువుకుంటానని ఇంట్లో చెప్పింది. నోరుమూస్కోమన్నారు. కాదంది. కుదరదన్నారు.నేను మీ మాట వినను చదువుకుని తీరతానని తెగేసి చెప్పింది. అలా..కూతురికి చదువుమీదున్న ఇష్టాన్ని తెలుసుకున్న తల్లిదండ్రుల మనస్సుల్ని కదిలించింది. కరదన్నారు తెగలోని పెద్దలు.కానీ మాకు ఏమైనా పరవాలేదు మా కూతురు చదువుకుంటుందని గట్టిగా చెప్పారు. శిక్ష తప్పదన్నారు.భరిస్తామన్నారు.

చకోటియా భుంజియా తెగలో యామిని తల్లిదండ్రుల అండతో స్కూలుకు వెళ్లింది. అక్కడ చదువు పూర్తి చేసుకుని కాలేజీలోకి కూడా చేరింది. అంతేకాదు పీహెచ్ డీ కూడా పూర్తి చేసి చకోటియా భుంజియా తెగలో మొట్టమొదటి స్కాలర్ గా నిలిచింది. ఆమె కృషిని పట్టుదలను తెగలోని వారంతా మెచ్చుకుంటున్నారు. అంతేకాదు యామిని స్ఫూర్తితో ఇప్పుడు చకోటియా భుంజియా తెగలో ఎంతోమంది అమ్మాయిలు బడిబాట పట్టారు.

అన్ని సౌకర్యాలు ఉండి చదువుకోవటానికి నానా పాట్లు పడుతున్న నేటి ఆధునిక సమాజంలోని ఎంతోమందికి యామిని స్ఫూర్తి అనటంలోఎటువంటి సందేహం లేదు.

Related Posts