బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి కేసు, హైదరాబాద్‌లోని Rose బిస్కెట్ తయారీ కంపెనీలో సోదాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కర్నూలు జిల్లాలో బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లోని రోజ్‌ బిస్కెట్‌ తయారీ కంపెనీలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. కంపెనీలో బిస్కెట్ల తయారీకి వాడుతున్న శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్‌లోని బిస్కెట్ల తయారీ యూనిట్‌ ని రోజ్‌ కంపెనీ క్లోజ్‌ చేసింది. అధికారుల నివేదిక తర్వాతే యూనిట్‌ తెరుస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నివేదిక తర్వాతలో కేసులో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కిరాణా దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్న ఘటనలో అభం శుభం తెలియని ముగ్గురు పసి పిల్లలు ఒకరి తర్వాత మరొకరు చనిపోయారు. దీంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో సెప్టెంబర్ 13న(ఆదివారం) హుస్సేన్ బాషా దంపతులు పొలం పనులకు వెళ్లారు. వారి కుమారుడు హుస్సేన్ భాష (6), కూతురు హుసెన్ బీ (4)తో పాటు చిన్న కూతురు జమాల్ బి సాయంత్రం ఇంటి సమీపంలోని ఓ దుకాణంలో రోజ్ మ్యాంగో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్నారు.

కొద్దిసేపటికే ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పొలం నుంచి వచ్చిన తల్లి దండ్రులు పిల్లల పరిస్థితిని గుర్తించి వెంటనే ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యమైందేమో వైద్యుల ప్రయత్నాలు ఫలించక హుస్సేన్ బాషా (6) చనిపోయాడు. మిగిలిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హుసెన్ బీ చనిపోయింది. ఆ తర్వాత జమాల్ బి కూడా ఆసుపత్రిలో కన్ను మూసింది.

విషయం తెలిసిన వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆళ్లగడ్డలోని లింగమయ్య వీధిలో ముగ్గురు చిన్నారులు బిస్కెట్ ప్యాకెట్ కొనుకున్న దుకాణాన్ని తనిఖీ చేశారు. ఘటనపై ఆరా తీశారు. రోజ్ మ్యాంగో బిస్కెట్లు హోల్ సేల్ సరఫరా చేసే ఓ ఏజెన్సీ దుకాణాన్ని గుర్తించి సీజ్ చేశారు. తనిఖీలన్నీ పూర్తయి వాస్తవాలు నిర్ధారణ అయ్యే వరకు గ్రామంలోని తల్లిదండ్రులు ఎవరూ పిల్లలకు దుకాణాల్లో అమ్మే తినుబండారాలు తినిపించొద్దని కోరారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఫుడ్ కంట్రోల్ అధికారులు చెప్పారు.

Related Posts