Home » ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కూలిపోతుంది
Published
1 year agoon
INX మీడియా కేసులో తమ సహచరుడు పి చిదంబరం నిరంతర నిర్బంధం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి చిదంబరం తీహార్ జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీహార్ జైలుకి వెళ్లి చిదంబరంను పరామర్శించారు. అనంతరం మన్మోహన్ సింగ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో ఏ నిర్ణయాన్ని ఏ ఒక్క వ్యక్తి తీసుకోలేదని,ఫైళ్ళలో రికార్డ్ చేయబడిన అన్ని నిర్ణయాలు సమిష్ఠి నిర్ణయాలన్నారు. డజను మంది అధికారులు ప్రతిపాదనను పరిశీలించి సిఫారసు చేసిన తర్వాతనే.. ఏకగ్రీవ సిఫార్సును మంత్రి చిదంబరం ఆమోదించారన్నారు. అయితే అధికారులది ఎలాంటి తప్పు లేకుంటే, సిఫారసును ఆమోదించిన మంత్రి నేరం చేసినట్లు ఎలా ఆరోపణలు చేయవచ్చో అది మన అవగాహనకు మించినదని అన్నారు. సిఫారసును ఆమోదించినందుకు మంత్రి బాధ్యుడయితే ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కూలిపోతుందన్నారు. ఈ కేసులో న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని తాము నమ్మకంగా ఉన్నామని, హృదయపూర్వకంగా ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.